యాప్నగరం

Godrej Family: లక్ష కోట్ల విలువైన కంపెనీకి ఏమైంది? 127 ఏళ్ల చరిత్రకు బీటలు.. విడిపోయిన గోద్రేజ్‌ కుటుంబం

Godrej Family Seals Deal: సబ్బుల నుంచి మొదలుకొని.. స్థిరాస్తి వరకు వ్యాపారాల్ని నిర్వహిస్తున్న అతిపెద్ద కంపెనీల్లో కచ్చితంగా గోద్రేజ్‌ గ్రూప్‌ ఉంటుందని చెప్పొచ్చు. అయితే 127 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న గోద్రేజ్ గ్రూప్ ఇప్పుడు విడిపోయింది. దీనిని పంచుకునేందుకు ఇప్పుడు వారసులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆది గోద్రేజ్, నదిర్‌లకు నమోదిత కంపెనీలు రానున్నాయి. జెంషెడ్, స్మిత చేతికి నమోదు కాని సంస్థలు దక్కనున్నాయి.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 2 May 2024, 1:50 pm
Godrej Family Networth: దేశంలోని ప్రఖ్యాత కుటుంబ వ్యాపారాల్లో గోద్రేజ్ ఒకటని చెప్పొచ్చు. రిలయన్స్, టాటా, మిస్త్రీ, వాడియా.. ఇలానే గోద్రేజ్‌కు కూడా మంచి పేరుంది. సబ్బుల నుంచి గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో రంగాల్లో ఇది విస్తరించింది. ఈ దిగ్గజ గోద్రేజ్ గ్రూప్‌కు గోద్రేజ్ కుటుంబం సారథ్యం వహిస్తుండగా.. అనివార్య కారణాలతో చీలిక రాగా.. ఇప్పుడు విడిపోయింది. ఆది గోద్రేజ్ (82), ఆయన సోదరుడు నదిర్‌లు (73) 5 నమోదిత కంపెనీలున్న గోద్రేజ్ ఇండస్ట్రీస్‌ను తీసుకుంటారు. వారి దాయాదులు అయిన జెంషెడ్ గోద్రేజ్ (75), స్మితా గోద్రేజ్ క్రిష్ణకు (74) నమోదు సంస్థ కాని (అన్‌లిస్టెడ్) గోద్రేజ్ అండ్ బోయ్స్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు, ముంబైలోని 3400 ఎకరాల విలువైన భూమితో పాటు ఇతర భూములు కూడా దక్కుతాయని తెలిపింది.
Samayam Telugu gODREJ fAMILY
గోద్రేజ్ ఫ్యామిలీ


దీని ప్రకారం.. గోద్రేజ్ అండ్ బోయ్స్, సబ్సిడరీ కంపెనీలు గల గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌కు ఛైర్‌పర్సన్, ఎండీగా జెంషెడ్ గోద్రేజ్ నియమితులవుతారు. ఆయన సోదరి స్మితా కుమార్తె నైరికా హోల్కర్ (42) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు.

గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్, గోద్రేజ్ అగ్రోవెట్ వంటి నమోదిత కంపెనీలు ఉండే.. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు ఛైర్మన్‌గా నదిర్ గోద్రేజ్ ఉంటారు. ఆది, నదిర్, వారి కుటుంబాలకు నియంత్రణ ఉంటుంది. ఆది కుమారుడు పిరోజ్ షా గోద్రేజ్ (42) ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉంటారు.

2026 ఆగస్టులో నదిర్ నుంచి ఛైర్‌పర్సన్ బాధ్యతలు ఆయన తీసుకుంటారు. ఇరు గ్రూప్‌లు గోద్రేజ్ బ్రాండ్‌ను మాత్రం వినియోగించుకుంటాయి. 1897లో ఆర్దేశిర్ గోద్రేజ్, ఆయన సోదరుడు పిరోజ్ షా కలిసి ఈ కంపెనీని స్థాపించారు. అయితే ఆర్దేశిర్‌కు పిల్లలు లేరు. పిరోజ్‌కు వారసులు (సౌహ్రబ్, దోసా, నావల్, బుర్జోర్) ఉన్నారు. బుర్జోర్ (ఆది, నదిర్), నావల్ (జెంషెడ్, స్మిత) పిల్లలే ఇప్పుడు గ్రూప్‌ను నడుపుతున్నారు.

ఈ గోద్రేజ్ గ్రూప్ విలువ దాదాపు రూ. 1.7 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. తాళాలు తయారు చేసే కంపెనీగా ఇది మొదలై.. ఆ తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేబుల్ ఆయిల్ సోప్ తయారు చేసింది. అప్పటివరకు జంతువుల కొవ్వుతో మాత్రమే సబ్బులు తయారయ్యేవి. 1944 సంవత్సరంలో బీరువాల తయారీలోకి అడుగుపెట్టింది. స్వాతంత్య్రం తర్వాత మొదటి ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు కూడా ఈ సంస్థ తయారుచేసిందే. ఇప్పుడు 85 కుపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్ గ్రూప్‌కు దాదాపు 120 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. చంద్రయాన్, మంగళ్‌యాన్ వంటి అంతరిక్ష ప్రయోగాల్లో కూడా గోద్రేజ్ సహకారం ఉంది. లూనార్ ఆర్బిట్ తయారీ, లాంచ్ వెహికిల్ తయారీకి తోడ్పాటు అందించింది.
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.