యాప్నగరం

విదేశీ పెట్టుబడులతో.. 7 లక్షల ఉద్యోగాలు

యువతకు గుడ్ న్యూస్.. త్వరలోనే నిరుద్యోగ కష్టాలు తీరనున్నాయి. విదేశీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టనుండటంతో.. ఉద్యోగాల కల్పన జరగనుంది.

TNN 16 Oct 2017, 1:10 pm
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విషయంలో ఎన్డీయే సర్కారు ఇప్పటికీ పెద్దగా విజయవంతం కాలేదు. కానీ రానున్న రోజుల్లో చైనా సంస్థల కారణంగా మోదీ ప్రభుత్వానికి ఈ తలనొప్పులు తగ్గే అవకాశం ఉంది. దేశంలో 85 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు సిద్ధపడుతున్నాయి. వీటిలో చైనా సంస్థలే ముందు వరుసలో ఉన్నాయి. ఈ పెట్టుబడుల వల్ల వచ్చే ఐదేళ్లలో 7 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా.
Samayam Telugu led by chinese nearly 600 companies line up 85 billion investments in india
విదేశీ పెట్టుబడులతో.. 7 లక్షల ఉద్యోగాలు


చైనాకు చెందిన శాన్ హెవీ ఇండస్ట్రీ ఒక్కటే భారత్‌లో 9.8 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ మాన్యూఫాక్చరింగ్ సంస్థల్లో ఒకటి. పసిఫిక్ కన్‌స్ట్రక్షన్, చైనా ఫార్చ్యూన్ ల్యాండ్ డెవలప్‌మెంట్, దాలిన్ వాండా, అమెజాన్ లాంటి సంస్థలు 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో భారత్‌లో పెట్టుబడి పెట్టనున్నాయి. రోల్స్ రాయిస్ సంస్థ 3.7 బిలియన్ డాలర్ల మేర, ఆస్ట్రేలియాకు చెందిన పెర్దమాన్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి.

మన దేశంలోకి రానున్న పెట్టుబడుల్లో చైనా కంపెనీల వాటానే 42 శాతం ఉండగా, అమెరికా సంస్థలు 24 శాతం, బ్రిటన్ కంపెనీలు 11 శాతం మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. ఎనర్జీ, వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులకు సంస్థలకు ఎక్కువ ఆసక్తి చూపుతుండగా.. తర్వాతి స్థానాల్లో నిర్మాణం, ఈ-కామర్స్ రంగాలు ఉన్నాయి.

‘ఇన్వెస్ట్ ఇండియా’ ద్వారా ఇప్పటికీ భారతదేశంలో అడుగుపెట్టని 200 కంపెనీలు.. మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా చూడటం కోసం భారత సర్కారు యత్నిస్తోంది. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్వెస్ట్ ఇండియా ఎండీ దీపక్ బగ్లా తెలిపారు. 2017 ఆర్థిక సంవత్సరంలో 43 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలోకి వచ్చాయి. క్రితం సంవత్సరం కంటే ఇది 9 శాతం అదనం కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.