యాప్నగరం

డ్రైవర్‌ అవసరం లేని ట్రాక్టర్‌.. మహీంద్ర ఘనత

డ్రైవర్ అవసరంలేని ట్రాక్టర్‌ను మహీంద్ర గ్రూప్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రదర్శించింది. ఇది దేశంలోనే తొలి డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ కావడం విశేషం.

TNN 20 Sep 2017, 9:11 am
డ్రైవర్ అవసరంలేని ట్రాక్టర్‌ను మహీంద్ర గ్రూప్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రదర్శించింది. ఇది దేశంలోనే తొలి డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ కావడం విశేషం. దీన్ని చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది ఈ ట్రాక్టర్ మార్కెట్‌లోకి వస్తుంది. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ప్రదర్శించిన అనంతరం మహీంద్ర అండ్ మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడారు. 20 - 100 హెచ్‌పీ శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేస్తామని, ఇవన్నీ విపణిలోకి రావడానికి సమయం పడుతుందని చెప్పారు.
Samayam Telugu mahindra mahindra showcases driverless tractor
డ్రైవర్‌ అవసరం లేని ట్రాక్టర్‌.. మహీంద్ర ఘనత


‘మా ట్రాక్టర్ ఆర్ అండ్ డీ ఎప్పుడూ ముందంజలో ఉంటూ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈరోజు డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించడం మా అందరికీ గర్వకారణం. ఇది వ్యవసాయ తీరును మార్చివేస్తుంది. ఉత్పాదకతను పెంచుతుంది. ప్రపంచ అవసరాలకు కావలసిన ఆహార ఉత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది’ అని గోయెంకా చెప్పారు. ఇక మహీంద్ర అండ్ మహీంద్ర వ్యవసాయ పరికరాల విభాగం ప్రెసిడెంట్ రాజేశ్‌ జేజురకర్‌ మాట్లాడుతూ.. ‘గతేడాది మేం ప్రారంభించిన ‘డిజిసెన్స్‌’ సాంకేతికత ఈ డ్రైవర్‌లెస్ ట్రాక్టరుకు అత్యున్నత స్థాయి మేథస్సును అందించింది. భారత రైతులకు గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుతుందని అంచనా వేస్తున్నాం. ఈ సాంకేతికతను త్వరలోనే అన్ని మహీంద్ర ట్రాక్టర్లలోకి చొప్పిస్తాం’ అని వెల్లడించారు.

అమెరికా, జపాన్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను తీసుకెళ్లనున్నట్లు రాజేశ్ తెలిపారు. మహీంద్ర ట్రాక్టర్లు ప్రపంచ వ్యాప్తంగా గట్టి పోటీనివ్వడానికి సిద్ధపడుతున్నాయని చెప్పారు. కాగా, ఈ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ స్టీరింగ్‌ను దానంతట అదే తిప్పుకుంటుంది(ఆటో స్టీర్‌). పొలంలో ఒక వరుసలో పని పూర్తయిన అనంతరం తిరిగి పక్క వరుసలోకి వెళ్తుంది. దీనికి ఎటువంటి కమాండ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనిలో పొందుపరిచిన ఆటో హెడ్‌ల్యాండ్‌ టర్న్‌ టెక్నాలజీతో దానంతట అదే తిరిగిపోతుంది. దూరం నుంచే ట్రాక్టర్‌ ఇంజిన్‌ను స్టార్‌ చేయవచ్చు.. నిలిపివేయవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.