యాప్నగరం

Personal Loans: ఈ 5 బ్యాంకుల్లోనే పర్సనల్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు..!

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు కీలక వడ్డీ రేటు రెపోను పెంచుతోంది. దీంతో అన్ని రకాల రుణాలు కస్టమర్లకు భారంగా మారుతున్నాయి. హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు వంటి వాటిపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయితే వడ్డీ రేట్లను పెంచుతోన్న ఈ తరుణంలో.. ఏ బ్యాంకులలో పర్సనల్ లోన్లు తక్కువ రేటుకి లభిస్తున్నాయో ఓసారి చూద్దాం..

Authored byKoteru Sravani | Samayam Telugu 24 Jun 2022, 9:00 pm

ప్రధానాంశాలు:

  • కీలక వడ్డీ రేటు రెపోను పెంచుతోన్న ఆర్‌బీఐ
  • లోన్ల వడ్డీ రేట్లను సమీక్షిస్తోన్న బ్యాంకులు
  • పర్సనల్ లోన్లపై కూడా పెరుగుతోన్న వడ్డీలు
  • 5 బ్యాంకులలో పర్సనల్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Personal Loan Interest Rates
పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచిన తర్వాత.. చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను కూడా సమీక్షిస్తున్నాయి. దీంతో లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్‌పై ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును విధిస్తున్నాయో ఒకసారి తెలుసుకుంటే మంచిది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు.. ఈ బ్యాంకు ప్రస్తుతం పర్సనల్ లోన్లపై ఏడాదికి 8.80 శాతం నుంచి 15.35 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ఒకవేళ రూ.5 లక్షల పర్సనల్ లోన్ కనుక మీరు ఈ బ్యాంకులో తీసుకుంటే ఐదేళ్ల కాలంలో నెలకు రూ.10,331 నుంచి రూ.11,987 మధ్యలో మీరు వాయిదాలను కట్టాల్సి ఉంటుంది. అంతేకాక ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాలి. పీఎన్‌బీ ఒక శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును విధిస్తోంది.

అయితే ఈ వడ్డీ రేట్ల విషయంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఎందుకంటే వారి వయసు, జెండర్, క్రెడిట్ స్కోర్ బట్టి వడ్డీ రేటును విధించడం జరుగుతుంది.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకు తన పర్సనల్ లోన్లపై 9.80 శాతం నుంచి 13.80 శాతం మధ్యలో వడ్డీ రేటును విధిస్తుంది. ఈ వడ్డీ రేటు లెక్కన తీసుకుంటే.. రూ.5 లక్షల రుణాన్ని, ఐదేళ్ల కాలంలో చెల్లించాల్సి వస్తే.. నెలకు రూ.10,574 నుంచి రూ.11,582 మధ్యలో ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజులు 1.5 శాతం వరకు లేదా రూ.15 వేల వరకు(ఏది తక్కువైతే అది) ఉన్నాయి.

Also Read : Card Tokenization : ఆర్‌బీఐ గుడ్‌న్యూస్... కార్డు టోకెనైజేషన్ డెడ్‌లైన్ పొడిగింపు

బ్యాంకు ఆఫ్ బరోడా.. పర్సనల్ లోన్లపై బ్యాంకు ఆఫ్ బరోడా ఏడాదికి 9.20 శాతం నుంచి 16.55 శాతం మధ్యలో వడ్డీ రేట్లను విధిస్తుంది. మీరు కనుక బ్యాంకు ఆఫ్ బరోడాలో రూ.5 లక్షల రుణాన్ని తీసుకుంటే.. నెలకు రూ.10,428 నుంచి రూ.12,306 మధ్యలో బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మొత్తం లోన్‌పై 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంకు విధిస్తోంది. ఈ ఫీజు కనిష్టంగా రూ.1000గా, గరిష్టంగా రూ.10 వేలుగా ఉంది.

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర.. ఈ బ్యాంకులో పర్సనల్ లోన్లను తీసుకుంటే వడ్డీ రేట్లు 9.35 శాతం నుంచి 13.70 శాతం మధ్యలో ఉన్నాయి. ఈ వడ్డీ రేట్ల లెక్కన రూ.5 లక్షల రుణానికి నెలకు రూ.10,464 నుంచి రూ.11,557 మధ్యలో ఈఎంఐలు చెల్లించాలి. దీంతో పాటు బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తన లోన్లపై 1 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును విధిస్తోంది.

యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. పైన పేర్కొన్న బ్యాంకుల కంటే అత్యధికంగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేటును విధిస్తోంది. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు పర్సనల్ లోన్లపై 9.8 శాతం నుంచి 13.9 శాతం మధ్యలో ఉన్నాయి. రూ.5 లక్షల లోన్‌కు కస్టమర్లు రూ.10,574 నుంచి రూ.11,608ను కట్టాల్సి ఉంటుంది.

Also Read : పేటీఎం సీఈవో ట్వీట్.. ఉద్యోగులలో సంబరాలు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.