యాప్నగరం

కర్ణాటక ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో ఘర్షణలు.. విస్ట్రన్ సంచలన నిర్ణయం!

Karnataka iPhone Factory | ఐఫోన్లను తయారు చేసే తైవాన్ కంపెనీ విస్ట్రన్‌లో తలెత్తిన ఘర్షణల విషయమై సంస్థ స్పందించింది. వైస్ ప్రెసిడెంట్‌ను బాధ్యతల నుంచి తప్పించింది.

Samayam Telugu 19 Dec 2020, 2:56 pm
కర్ణాటకలోని నర్సాపురలో ఆపిల్ ఐ ఫోన్లను తయారు చేసే విస్ట్రన్ ప్లాంట్‌లో ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల కారణంగా రూ.400 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న విస్ట్రన్.. తర్వాత రూ.52 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇటీవలే విస్తరించిన ఈ యూనిట్‌లో కొన్ని తప్పిదాలు జరిగినట్లు విస్ట్రన్ తెలిపింది. లేబర్ ఏజెన్సీలు, పేమెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించింది.
Samayam Telugu Wistron
(File photo)


ఈ తప్పిదాన్ని సరి చేసుకునేలా తక్షణ చర్యలకు దిగింది. ఇండియాలో బిజినెస్ వ్యవహరాలను చూసుకునే వైస్ ప్రెసిడెంట్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

వారం రోజుల క్రితం వర్కర్లు సహా దాదాపు 7 వేల మంది విస్ట్రన్ ప్లాంట్‌లో జీతాలు, ఓవర్ టైం విషయమై ఘర్షణలకు దిగారు. ఈ అల్లర్ల తర్వాత పోలీసులు 150 మందిని అరెస్ట్ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ విస్తరణ కోసం.. 25 వేలమందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని.. కర్ణాటకలో మరో రూ.900 కోట్లు పెట్టుబడి పెట్టాలని విస్ట్రన్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

కోలార్‌లోని విస్ట్రన్ ప్లాంట్‌లో 12 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 1200 మంది పర్మనెంట్ ఉద్యోగులు కాగా.. మిగతా వారు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్నారని తెలుస్తోంది.

‘నర్సాపుర ప్లాంట్‌లో జరిగిన ఘటన దురదృష్టకరం. ఈ ఘటన విషయంలో దర్యాప్తు జరుపుతున్నాం. కొందరు సిబ్బందికి జీతాలు సరిగా ఇవ్వడం లేదని తెలిసింది. మా వర్కర్లకు క్షమాపణలు చెబుతున్నాం’ అని తైవాన్ కంపెనీ తెలిపింది. ప్రాధాన్యాల ఆధారంగా వర్కర్లకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. వర్కర్ల ఆందోళనలను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకోవడం కోసం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 24x7 గ్రీవియన్స్ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.