యాప్నగరం

ఐపీఎల్ రికార్డులు బద్దలుకొట్టిన క్రిస్ మోరీస్

పుణేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు క్రిస్ మోరీస్ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్ట్రయిక్ రేట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

TNN 12 Apr 2017, 12:33 pm
పుణేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు క్రిస్ మోరీస్ ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రయిక్ రేట్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. మంగళవారం రాత్రి పుణేలో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన మోరీస్ 9 బంతుల్లోనే 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ జట్టు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. సెంచరీ సాధించిన సంజూ శాంసన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన మోరీస్.. వస్తూనే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కొన్న 9 బంతుల్లో నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన ఈ ఢిల్లీ ఆటగాడు 422.22 స్ట్రయిక్ రేట్‌తో 38 పరుగులు చేశాడు. మరో రెండు బంతులు ఆడి ఉంటే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టేవాడా.. అనేంతగా మోరీస్ చెలరేగాడు.
Samayam Telugu chris morris creates a record for highest strike rate in an innings in ipl history
ఐపీఎల్ రికార్డులు బద్దలుకొట్టిన క్రిస్ మోరీస్


25 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోగా.. మోరీ సంచలన ఇన్నింగ్స్ ముందు వరకూ ఆ రికార్డు మోర్కెల్ పేరిట ఉంది. 7 బంతుల్లో 400 స్ట్రయిక్ రేట్‌తో మోర్కెల్ 28 పరుగులు చేశాడు. 2012లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు చెన్నైకి 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దాన్ని చేధించే క్రమంలో మోర్కెల్ ఈ ఫీట్ సాధించాడు.

సంజూ శాంసన్ అవుటయ్యాక కేవలం పది బంతులు మాత్రమే మిగిలి ఉన్న దశలో మోరీస్ క్రీజులోకి వచ్చాడు. జంపా ఓవర్లో 22 పరుగులు రాబట్టిన ఈ సఫారీ ప్లేయర్.. స్టోక్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్నాడు. చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచి ఢిల్లీ స్కోరు బోర్డుపై 205 పరుగులను ఉంచాడు. శాంసన్, మోరీస్ వీరవిహారంతో పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలిసారిగా ఓ టీ20 మ్యాచ్‌లో 200కిపైగా స్కోరు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు చివరి నాలుగు ఓవర్లలో 76 పరుగులు రాబట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.