యాప్నగరం

డివిలియర్స్.. ఇక్కడ ధోని మరిచిపోయావా..?

వికెట్ కీపర్‌గా అతను ఏ మ్యాచ్‌లోనూ ఫెయిల్ అవ్వలేదు. మ్యాచ్ చేజారుతున్నా ఉదాసీనత మాత్రం ఎప్పటికీ ధోని దరిచేరదు

TNN 17 Apr 2017, 9:01 am
మైదానంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ నుంచి మెరుపులు ఈ మధ్యకాలంలో తగ్గిండొచ్చు.. కానీ వికెట్ కీపర్‌గా అతను ఏ మ్యాచ్‌లోనూ ఫెయిల్ అవ్వలేదు. మ్యాచ్ చేజారుతున్నా ఉదాసీనత మాత్రం ఎప్పటికీ ధోని దరిచేరదు. తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ధోనీ వికెట్ కీపింగ్ నైపుణ్యం మరోసారి క్రికెట్ ప్రపంచానికి తెలిసొచ్చింది. రైజింగ్ పుణె సూపర్ జైయింట్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు 10.1 ఓవర్లకి 70/2తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. అప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటైనా.. ఏబీ డివిలియర్స్ (29: 30 బంతుల్లో 1x4, 2x6) నిలకడగా ఆడుతూ బెంగళూరును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సీజన్‌ ఆరంభంలోనే ఫామ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ దూకుడు చూస్తే మ్యాచ్‌ని అలవోకగా గెలిపించేలా కనిపించాడు. కానీ.. రైజింగ్ పుణె మాజీ కెప్టెన్ ధోనీ వ్యూహం మ్యాచ్‌ని మలుపు తిప్పింది.
Samayam Telugu dhonis lightning stumping throws ab de villiers off the foot
డివిలియర్స్.. ఇక్కడ ధోని మరిచిపోయావా..?


He's at it again. pic.twitter.com/6fgLHEGR6k — Mayank Kapoor (@mayankkapoor78) April 16, 2017
బౌండరీ లైన్ చిన్నదిగా ఉండటంతో డివిలియర్స్ ఎక్కువగా క్రీజు నుంచి వెలుపలకి వెళ్లి భారీ షాట్లకు ప్రయత్నిస్తున్నాడు. దీన్ని గమనించిన ధోని.. సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో చర్చలు జరిపి వ్యూహం రచించాడు. ఇందులో భాగంగానే లెగ్‌సైడ్ వైడ్ రూపంలో కొన్ని బంతులను విసిరి తాహిర్ పరుగులు కూడా సమర్పించుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతికి డివిలియర్స్ తడబడి ధోనీ వ్యూహానికి చిక్కాడు. అప్పటి వరకు లెగ్ వికెట్‌కి దగ్గరగా బంతులు వేస్తూ వచ్చిన తాహిర్.. ఒక్కసారిగా ఆఫ్‌స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని బంతిని విసిరాడు. అయితే బంతిని తప్పుగా అర్థం చేసుకున్న ఏబీ.. క్రీజు వదిలి షాట్ కోసం ప్రయత్నించాడు. దీంతో బంతి బ్యాట్‌కి అందకపోగా... నేరుగా వచ్చి ధోనీ చేతుల్లో పడింది. ఇదే అదునుగా భావించిన ధోనీ.. క్షణాల వ్యవధిలోనే వికెట్లను గీరాటేశాడు. అప్పటికే స్టపింగ్ ప్రమాదం పసిగట్టిన డివిలియర్స్ క్రీజులోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. ఈ వికెట్‌ చేజారడంతోనే బెంగళూరుపై ఒత్తిడి పెరిగి చివరికి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో పుణె కెప్టెన్ స్టీవ్‌స్మిత్ కంటే ధోనీనే ఎక్కువగా ఫీల్డింగ్ సెట్ చేస్తూ.. బౌలర్లతో చర్చిస్తూ కనిపించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.