యాప్నగరం

ఉన్నత విద్యకు ఎక్కువ ఖర్చు చేసేది మనమే!

పిల్లల విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు అధిక మొత్తంలో వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఈ విషయంలో ముందున్నారు.

TNN 13 Jun 2017, 12:31 pm
విద్య వెల కట్టలేనిది... కానీ పిల్లల విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు చాలా పెద్ద మొత్తాన్నే వెచ్చిస్తున్నారు. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాల వారు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. సాంకేతిక విద్య కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల తల్లిదండ్రులు అధిక మొత్తంలో వెచ్చించి పిల్లల కలలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఇంటి ఖర్చుల్లో ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల వారు సగటున 15.3 శాతం, పట్టణ ప్రాంతాల వారు సగటున 18.4 శాతం కేటాయిస్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇది గ్రామీణుల్లో 43 శాతం, పట్టణాల్లో 48 శాతంగా ఉంది. భారతదేశంలో ఉన్నత విద్యపై వ్యయం అనే పేరుతో నేషనల్ శాంపిల్ సర్వే నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
Samayam Telugu nsso survey ssouth india spends most on higher education
ఉన్నత విద్యకు ఎక్కువ ఖర్చు చేసేది మనమే!


దక్షిణాది రాష్ట్రాల్లోని పట్ణణ ప్రాంత కుటుంబాలు ఉన్నత విద్య కోసం ఏడాదికి సగటున రూ.49,600 ఖర్చు చేస్తుండగా, తర్వాతి స్థానంలో పశ్చిమ రాష్ట్రాల వారు రూ.45,436 వ్యయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది ఏడాదికి సగటున రూ.36.063 ఉంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో సగటున రూ.25,143 ఖర్చు చేస్తున్నారు. ఉన్నత విద్య పై సగటు భారతీయుడు అధికంగా ఖర్చు చేస్తున్నారు... చాలా కుటుంబాలు ఇంటి ఖర్చుల్లో 1/3 వంతు విద్య కోసమే వెచ్చిస్తున్నారని ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనంలో చంద్రశేఖర్‌తోపాటు తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పి. గీతారాణి, జర్మనీ యూనివర్సిటీకి చెందిన సోహమ్ సాహూ పాలుపంచుకున్నారు.

పట్టణ ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు తక్కువ ఖర్చు చేస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో మధ్య భారత రాష్ట్రాలు తక్కువ వెచ్చిస్తున్నాయి. ఉపాధి అవకాశాల్లో అనిశ్చితి ఉన్నప్పుడు, ఉన్నత విద్యావకాశాల కోసం పేద కుటుంబాలకు ఖర్చు తడిసి మోపుడవుతుంది. ఉన్నత విద్యలో సంపద అసమానతలను గురించి ఇది వివరిస్తుందని అధ్యయనవేత్తలు తెలిపారు. అయిదేళ్లకు ఒకసారి నేషనల్ శాంపిల్ సర్వే నిర్వహించే ఈ సర్వేలో కుటుంబ ఖర్చులను విశ్లేషించి అంచనా వేస్తుంది. కానీ ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థి ప్రతి కుటుంబాన్ని ఇది పరిగణనలోకి తీసుకోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.