యాప్నగరం

Mydukur EVM Destroyed: ఈవీఎంలు పగలుగొట్టిన వైసీపీ నేతలు.. పోలింగ్ బూత్‌కు తాళం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగా, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉద్రికత్తలు నెలకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Samayam Telugu 11 Apr 2019, 9:51 am
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగా, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉద్రికత్తలు నెలకున్నాయి. గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎంను నేలకేసి కొట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, కడప, గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామం బూత్ నంబర్ 126లో ఈవీఎంలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలింగ్ స్టేషన్ కు తాళం వేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం పానకాలపాలెం పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఏజెంట్ ఈవీఎంను బద్దలుకొట్టాడు. దీంతో ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం సనతా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అసహనంతో ఈవీఎంను పగలగొట్టడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu evms


పొరుమామిళ్ల పోలింగ్ స్టేషన్ 77, 78లో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను 9 గంటల వరకు పనిచేయక పోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ పోలింగ్ అధికారులపై మండిపడ్డారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచేరువు గ్రామంలో టీడీపి వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త గాయపడ్డారు. మైదుకూరు మండలం రాయప్పగారిపల్లి బూత్‌లో టీడీపీకి ఓటు వేశామని తమపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని మహిళల ఆరోపించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బిచ్చన చెంచు సంతమాగులూరు పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో ప్రవేశించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

మరోవైపు, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు క్యూలో గంటల తరబడి వేచి ఉన్నారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలోని 190 పోలింగ్ కేంద్రంలో పార్లమెంట్ కు చెందిన ఈవీఎం మొరాయించడంతో ఇబ్బందులు పడుతున్నారు. తన ఓటు హక్కు వినియోగించడానికి వచ్చిన ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో బయటే కూర్చుని ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.