యాప్నగరం

టీడీఎల్పీ నేతగా బాబు.. జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్తారా?

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్‌ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని జోరుగా ప్రచారం సాగింది.

Samayam Telugu 29 May 2019, 12:21 pm
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్‌ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, చంద్రబాబే టీడీఎల్పీ నేతగా ఉంటారని టీడీపీ వర్గాలు మంగళవారం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 10.30 గంటలకు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. టీడీఎల్పీ నేతగా తీర్మానిస్తూ చేసిన ప్రతిపాదనకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
Samayam Telugu Chandrababu


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్య ఉందని, నేతలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల కోపం వల్ల టీడీపీ ఓటమి చెందలేదని, జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించిందని బాబు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన కారణాలు, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

అలాగే జగన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లాలా? వద్దా? అన్న అంశంపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశానికి ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, కనకమేడల రవీంద్రకుమార్‌, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్‌, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తదితరులు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.