యాప్నగరం

ఎన్నికల సిత్రం.. నరసాపురంను పంచుకున్న బంధువులు

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం, దీని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ప్రతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారిలో బంధువులు, సన్నిహితులు ఉండటం విశేషం. వీరంతా ఒకే పార్టీ తరఫున, ప్రత్యర్ధులుగానూ పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu 27 Mar 2019, 9:15 am
ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ, వారసత్వ రాజకీయాలు కొత్తేమీకాదు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతుంటారు. కొన్నిసార్లు అన్నదమ్ములే ఒకరిపై ఒకరు వేర్వేరు పార్టీల నుంచి పోటీచేస్తుంటారు. లేదంటే ఒకే పార్టీ తరఫున వేర్వేరు స్థానాల నుంచి పోటీచేస్తుంటారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం, దీని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారిలో బంధువులు, సన్నిహితులు ఉండటం విశేషం. వీరంతా ఒకే పార్టీ తరఫున, ప్రత్యర్ధులుగానూ పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu Narasapuram


జనసేన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని భీమవరం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. అలాగే, ఆయన అన్నయ్య నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు.

బాబాయ్ (కాంగ్రెస్) vs అబ్బాయ్ (వైసీపీ)
మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ తరఫున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. ఆయన అన్న కుమారుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు ఇదే స్థానం నుంచి వైసీపీ తరఫున తలపడుతున్నారు. అంటే బాబాయ్, అబ్బాయ్ ముఖాముఖి పోటీపడుతున్నారు.

బీజేపీ
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ తరఫున వియ్యంకులు బరిలో ఉన్నారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు లోక్‌సభ అభ్యర్థిగా.. ఆయన వియ్యంకుడు గట్టిం మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

టీడీపీ
టీడీపీ తరఫున పోటీలో ఉన్నవాళ్లు బంధువులు కాదుకానీ మంచి స్నేహితులు. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున వేటుకూరి శివరామరాజు పోటీలో ఉన్నారు. ఈయన స్వస్థలం ఉండి నియోజకవర్గం కలవపూడి. అదే గ్రామానికి చెందిన శివరామరాజు స్నేహితుడు మంతెన రామరాజు (రాంబాబు) ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.