యాప్నగరం

Chhattisgarh: ప్రారంభమైన పోలింగ్.. బరిలో ప్రముఖులు

చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో తొలి విడతలో మావోయిస్టుల హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో 72 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది.

Samayam Telugu 20 Nov 2018, 8:28 am
చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల చివరి విడత పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతగా నవంబరు 12న మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 18 నియోజకర్గాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 72 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 20 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, లక్ష మందికిపైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. తుది విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శాసనసభ స్పీకర్‌, తొమ్మిది మంది మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బూపేష్‌ భగేల్‌, కాంగ్రెస్‌ నుంచి సీఎం రేసులో ఉన్న చరణ్‌దాస్‌ మహంత్‌, టీఎస్‌ సింగ్‌దేవ్‌, జేసీసీ అధ్యక్షుడు అజిత్‌జోగి, ఆయన సతీమణి రేణు జోగి తదితరులు బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు 72 నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తున్నాయి. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Samayam Telugu CHA.


ప్రస్తుతం ఎన్నికల జరుగుతోన్న 72 నియోజకవర్గాల్లో 46 జనరల్‌, 17 ఎస్టీ, 9 ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. ఇక, 2013 ఎన్నికల్లో ఈ 72 స్థానాల్లో 43 చోట్ల బీజేపీ, 27 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గత పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న బీజేపీ ఈసారి కూడా గెలుపు తమదేనని ధీమాతో ఉంది. కాంగ్రెస్ మాత్రం చత్తీస్‌గఢ్‌లో తామే అధికారంలోకి వస్తామని భావిస్తోంది. మరోవైపు, తొలి విడతలో మావోయిస్టుల హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో 72 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. రెండో విడతలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా వస్తున్నారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.