యాప్నగరం

Karnataka Results: కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి 'ఆరు' కారణాలు.. అవేంటో తెలుసా?

Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 38 ఏళ్ల ఆచారాన్ని కొనసాగించడం ద్వారా.. ఓటర్లు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా అధికారంలో లేకుండా పోయింది. కర్ణాటకలో 1985 నుంచి ఏ పార్టీ కూడా వరుసగా ఐదేళ్లకు మించి ప్రభుత్వంలో కొనసాగలేదు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీకి కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది.

Samayam Telugu 13 May 2023, 4:09 pm
Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగింది. కాంగ్రెస్‌కు దాదాపు 43 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీకి దాదాపు 36 శాతం, 13 శాతం ఓట్లు జేడీఎస్ ఖాతాలోకి వెళ్లాయి. మరోవైపు 135కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. గ్రాండ్ విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. ఈ సమయంలో.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి, బీజేపీ ఓటమికి కారణాలు ఏంటనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Samayam Telugu what reason behind congress win in karnataka assembly elections
Karnataka Results: కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి 'ఆరు' కారణాలు.. అవేంటో తెలుసా?


40 శాతం కమీషన్ ప్రభుత్వం

కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవినీతి అంశాన్ని గట్టిగానే లేవనెత్తింది. బొమ్మై ప్రభుత్వానికి 40 శాతం ప్రభుత్వం, పే సీఎం అనే పేరు పెట్టింది. కాంగ్రెస్‌ అగ్రనేతల నుంచి స్థానిక నేతల వరకు.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఏబీపీ- సీ ఓటర్ ముందస్తు సర్వేలో కూడా.. రాష్ట్రంలో అవినీతి పెద్ద సమస్య ఉందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే.. అవినీతి ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.

ప్రధాన సమస్యలపై ఫోకస్

ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ ఫోకస్ అంతా ప్రధాన సమస్యలపైనే పెట్టింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీ అనర్హత, ED-CBI దాడులు, ధరల పెరుగుదల, అవినీతి, శాంతి భద్రతలు, రిజర్వేషన్లు, మతపరమైన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎక్కువగా హైలెట్ చేసింది. కర్నాటకలో కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. పీఎఫ్‌ఐ, బజరంగ్‌దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. ప్రధాని మోదీ, నడ్డా వంటి అగ్రనేతల నుంచి స్థానిక నేతల వరకు కాంగ్రెస్‌ను భజరంగబలితో ముడిపెట్టి సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కూడా హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది.

బీజేపీ కీలక నేతలకు ఆహ్వానం

మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు లక్ష్మణ్ సవాడి, ఎస్.షెట్టర్ వంటి నేతలను కాంగ్రెస్ ఆకర్షించింది. షెట్టర్ ఓడిపోయినా.. మిగతా నేతలు గెలిచారు. ఒకప్పుడు బీజేపీతో సన్నిహితంగా మెలిగిన హెచ్‌డీ తమ్మయ్యకు కూడా ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో సీటీ రవిపై తమ్మయ్య ఆధిక్యంలో ఉన్నారు. ఇలా చేరికలపై కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యింది.

ఐదు హామీలు

కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు హామీలను ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో ఈ హామీల గురించి ప్రజలకు వివరించింది. గృహజ్యోతి యోజన కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, గృహ లక్ష్మి యోజన కింద కుటుంబాన్ని నడుపుతున్న మహిళకు నెలకు 2000 రూపాయలు, మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం, పట్టభద్రులైన యువతకు నెలకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పింది. అన్న భాగ్య యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెలా ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇవి ఆ పార్టీకి ఓట్ల వర్షం కురిపించాయి.

దూకుడుగా ప్రచారం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. వార్డు నుంచి రాజధాని వరకు తమ గొంతును గట్టిగా వినిపించింది. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంది. చాలా ఏళ్ల తర్వాత కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోసం సోనియా గాంధీ స్వయంగా ర్యాలీ తీశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలోనే మకాం వేశారు. రాహుల్ గాంధీ 11 రోజుల్లో 23 ర్యాలీలు, 2 రోడ్ షోలు నిర్వహించారు. ప్రియాంక గాంధీ 9 రోజుల్లో 15 ర్యాలీలు, 11 రోడ్‌షోలు నిర్వహించారు. తన సొంత రాష్ట్రంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 15 రోజుల్లో 32 ర్యాలీలు, ఒక రోడ్‌షో నిర్వహించారు.

ఐక్యతగా అడుగులు

పార్టీ నేతలను ఐక్యంగా ఉంచడం కాంగ్రెస్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. అయితే.. ఎన్నికలకు ఏడాది ముందే కాంగ్రెస్ తన ప్రయత్నాలను ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధానంగా రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి సిద్ధరామయ్య, మరొకటి డీకే శివకుమార్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ ఇద్దరు నేతలు కలిసి అడుగులు వేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా పోస్టర్లు మొదలు.. వేదిక వరకు ఎక్కడ చూసినా ఇద్దరు నేతల హవా కనిపించింది. మే 10న ఓటింగ్‌కు ముందు.. ఇద్దరు నేతల ఇంటర్వ్యూ వీడియోను కూడా పార్టీ విడుదల చేసింది. ఎన్నికల అనంతర పోరు, ప్రభుత్వంలో అస్థిరత అనే సందేశం ఓటర్లకు వెళ్లకూడదని పార్టీ ప్రయత్నించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.