యాప్నగరం

నాలుగేళ్ల పసిగుడ్డు నం.1.. అది కేటీఆర్ ఘనతే!

సిరిసిల్ల టీఆర్‌ఎస్ సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Nov 2018, 8:44 pm
నాలుగేళ్ల పసిగుడ్డు దేశంలోనే నంబర్ 1గా ఎదిగిందని తెలంగాణ రాష్ట్ర పురోగతిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమైతదో అని కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారని, అందరి అనుమానాలు, సందేహాలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంగళవారం (నవంబర్ 20) టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
Samayam Telugu sircilla


‘మన మిషన్ భగీరథను 11 రాష్ట్రాల అధికారులు వచ్చి పరిశీలించారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఈ పథకాన్ని ఎలా అమలు చేశారో చెప్పడానికి అధికారులను ఆహ్వానించింది. రైతు బీమా అంతకంటే గొప్ప పథకం. ఇప్పటివరకూ రాష్ట్రంలో దీని ద్వారా 2500 కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందించాం.’ అని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ సాధనలో పాత కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల వాసులు కీలక పాత్ర పోషించారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘రాష్ట్ర సాధనకు మనమంతా చాలా కష్టపడ్డాం. తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని చాలా మంది భయపెట్టారు. అవన్నీ పటాపంచలు చేశాం’ అని కేసీఆర్ చెప్పారు.

సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగాయని కేసీఆర్ చెపపారు. కానీ, సమస్య పూర్తిగా సమసిపోలేదన్నారు. ‘సిరిసిల్ల మహిళలు అపెరల్ పార్కుల్లో యజమానులు కావాలి. ఉత్పత్తులను అమెరికాలో అమ్మాలి. అది నా కల’ అని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఇసుక మీద రూ. 10 కోట్ల ఆదాయం కూడా రాలేదని, టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో రూ. 2557 కోట్ల ఆదాయం వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఆ ఘనత గనుల శాఖ మంత్రి కేటీఆర్‌దే అని ప్రశంసించారు.

వేములవాడ ఆలయానికి రానున్న ప్రభుత్వంలో నిధులు భారీగా కేటాయిస్తామని, అద్భుతంగా చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఆలయానికి ఇప్పటికే 30 ఎకరాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని చెప్పారు. మిడ్ మానేరులో నీళ్లు చూసి తనకు చాలా సంతోషం కల్గిందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో సిరిసిల్ల అంతా పచ్చదనం పరచుకుంటుందని కేసీఆర్ చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేటీఆర్, చెన్నమనేని రమేశ్ నేతృత్వంలో అభివృద్ధి పనులు చాలా బాగా జరిగాయని అన్నారు. వారిద్దరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.