యాప్నగరం

వీడియో: చంద్రబాబు తడబాటు.. మహాకూటమిలోకి ‘జనసేన’!

చంద్రబాబు నాయుడు మళ్లీ తడబడ్డారు. ఖమ్మం సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు.

Samayam Telugu 28 Nov 2018, 10:23 pm
కీలక సభల్లో తడబడే అలవాటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి అదే పొరపాటు చేశారు. బుధవారం (నవంబర్ 28) సాయంత్రం ఖమ్మంలో ప్రజాకూటమి నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్న చంద్రబాబు సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీతో ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరించారు. బీజేపీపైనా, టీఆర్‌ఎస్ పైనా ఘాటు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ప్రజాకూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని చెప్పుకొస్తూ.. పొరపాటున జనసేన గురించి ప్రస్తావించడం గమనార్హం.
Samayam Telugu chandra


తెలంగాణ ఎన్నికలకు 5 రోజులే ఉందని.. ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా తయారవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చే పక్షాలన్నింటినీ కూడగడతామని, ప్రజలు ఈ కూటమిని ఆదరించాలని చెప్పారు. దీనికి తొలిసారిగా తెలంగాణ ఎన్నికల్లోనే, ఖమ్మం సభతోనే నాంది పడుతోందన్నారు.

తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు చారిత్రక అవసరమని చెప్పిన చంద్రబాబు.. టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసి వచ్చిన పార్టీల అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో జనసేన, సీపీఐ.. ఇలా అన్ని పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయాలని చెప్పారు. కోదండరాం పార్టీ అయిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) గురించి చెప్పబోయి.. పొరపాటున జనసేన అనేశారు. ఆ తర్వాత దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ‘తెలంగాణ జనసేన’ అన్నారు.


చంద్రబాబు పొరపాటున ప్రస్తావించిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్‌ను, ఆయన పార్టీని చంద్రబాబు మరచిపోవడంలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి జనసేన ప్రస్తావన పొరపాటున వచ్చినా.. నిజమే చెప్పారని, జనసేన పార్టీని గెలిపించాల్సిందేనని.. ఈ మాటలు ఏపీలో చెప్పాలని కొంత మంది కామెంట్ చేస్తున్నారు..

ప్రజాకూటమి విషయంలోనూ చంద్రబాబు తడబడటం గమనార్హం. ప్రజాకూటమికి బదులుగా ఆయన పలుమార్లు ప్రజాస్వామ్య కూటమి అన్నారు. అయితే.. చివర్లో తమ కూటమి ప్రజాస్వామ్య కూటమే అనే అర్థం వచ్చేటట్లు సరిచేసుకోవడం గమనార్హం. గతంలో ఏపీలో ఓ సభలో మాట్లాడుతూ.. బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు పొరపాటుగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Also Read: బ్రిటిషర్లపై బాబు పోరాటం.. పేలుతున్న సెటైర్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.