యాప్నగరం

Vemulavada: ఎన్నికల వేళ చెన్నమనేని పౌరసత్వంపై మళ్లీ ఫిర్యాదు!

మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Samayam Telugu 21 Nov 2018, 11:59 am
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పౌరసత్వ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై మంగళవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో చెన్నమనేని రమేశ్‌బాబు పౌరసత్వం పొందారంటూ శ్రీనివాస్ దాదాపు పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో హైకోర్టు, కేంద్ర హోంశాఖల వెల్లడించిన వివరాలను అందజేసి, రమేశ్‌బాబు నామినేషన్‌ను తిరస్కరించాలని ఆయన కోరారు. అయితే, ఈ విషయంలో డిసెంబరు 12 వరకు కోర్టు స్టే ఉన్నట్లు తెలిపే పత్రాలను టీఆర్ఎస్ అభ్యర్థి తమకు చూపారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
Samayam Telugu trs


దీంతో ఆ పౌరసత్వం అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి, చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని గతేడాది డిసెంబర్‌లోనే కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఆయన పౌరసత్వం రద్దుపై గత ఆగస్టు 31న హోంశాఖ వివరాలు వెల్లడించి, ఆయన భారత పౌరుడు కాదంటూ తీర్పునిచ్చింది. దీనిపై మరోసారి ఆయన రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, దీనిని కూడా హోంశాఖ అప్పుడే కొట్టివేసింది. ఏడాది పాటు దేశంలోనే ఉండాలనే నిబంధనను రమేశ్ ఉల్లంఘించడం వల్లే అతని పౌరసత్వం రద్దు చేసినట్లు హోంశాఖ పేర్కొంది. హోంశాఖ నివేదిక ప్రకారమే కేంద్రప్రభుత్వం రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

సంవత్సరంపాటు దేశంలోనే ఉండాలనే నిబంధన 2009 ఫిబ్రవరి 25 తర్వాత అమల్లోకి వచ్చిందని, తనకు 2009 ఫిబ్రవరి 3నే పౌరసత్వం వచ్చినట్లు రమేశ్ పేర్కొన్నారు. కాబట్టి తనకు పౌరసత్వం ఇచ్చిన తర్వాత విధించిన నిబంధన వర్తించదని అంటున్నారు. కాగా రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి, పౌరసత్వం రద్దు ఉత్తర్వులను 6వారాలు నిలిపివేసినట్టు ఈఏడాది జనవరిలో వెల్లడించింది. ప్రస్తుతం, ఎన్నికల జరుగుతుండటంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.