యాప్నగరం

KCR: అక్కడ ప్రచారం చేస్తే అధికారం కోల్పోతారనే సెంటిమెంట్‌‌ను కేసీఆర్ తిరగరాశారు!

ఎన్నికల సమయంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టాలంటే ప్రధాన పార్టీల నేతలు వెనకడుగువేస్తారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే అధికారానికి దూరమవుతారనే భయం వారిని వెంటాడేది.

Samayam Telugu 12 Dec 2018, 10:11 am
ఎన్నికల సమయంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టాలంటే ప్రధాన పార్టీల నేతలు వెనకడుగువేస్తారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే అధికారానికి దూరమవుతారనే భయం వారిని వెంటాడేది. అందుకే గత 30 ఏళ్లలో ఓ ఒక్క సీఎం కూడా అక్కడ అడుగుపెట్టలేదు. కానీ ఈ సారి ఆ సెంటిమెంట్‌ను కేసీఆర్ పూర్తిగా మార్చివేసి చరిత్రను తిరగరాశారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డి తరపున కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Samayam Telugu kcr3


ఇక, 1989లో నాగర్‌కర్నూల్‌లోని ఓ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారానికి రాజీవ్ గాంధీ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రధాని పదవిని పోగొట్టుకున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున నటుడు కృష్ణ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చి, అదే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్టీఆర్ సైతం 1989 ఎన్నికల్లో ఇక్కడ ప్రచారం నిర్వహించి తర్వాత జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకునే చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కూడా నాగర్‌కర్నూల్‌‌లో అడుగుపెట్టలేదు. మొత్తానికి సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్‌లో ప్రచారం చేసి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడంతో ఆ సెంటిమెంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి 54,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఇక్కడ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉద్దండ నేతను ఓడించి మర్రి జనార్ధన్ రెడ్డి భారీ ఆధిక్యంతో గెలవడమే కాదు, టీఆర్ఎస్ 88 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి అధికారంలో వచ్చింది. ఉమ్మడి మహబూబ్‌‌నగర్ జిల్లాలో 14 స్థానాలకు గానూ 13 చోట్ల కారు జోరు కొనసాగింది. ప్రచారం చివరి రోజున కేసీఆర్ ఇక్కడ సుడిగాలి పర్యటన చేసి, అభ్యర్థులకు గెలుపునకు సహకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.