యాప్నగరం

Telangana: రైతు బంధు వల్ల ఆత్మహత్యలు తగ్గాయా!

రైతు బంధు, రైతు బీమా, పంటల బీమా, వ్యవసాయ రుణాల మాఫీ లాంటి పథకాలతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం తెలిపింది.

Samayam Telugu 18 Nov 2018, 11:01 am
రైతు బంధు, రైతు బీమా, పంటల బీమా, వ్యవసాయ రుణాల మాఫీ లాంటి పథకాలతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ లాంటి సాగునీటి ప్రాజెక్టులతో రెైతులకు ఎంతో మేలు చేకూరిందని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారథి తెలిపారు. అయితే, వ్యవసాయ సంక్షోభం కేవలం తెలంగాణకే ప్రత్యేకం కాదని, దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, నవీకరించిన భూ రికార్డుల ఆధారంగా రైతు బంధు పథకాన్ని అమలు చేశామని వెల్లడించారు. ఈ పథకం వల్ల రైతులకు ఎంతో లబ్ది చేకూరుతుందని, ఖరీఫ్‌కు ముందు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే పని ఉండదని పార్దసారథి తెలియజేశారు. ఈ పథకాన్ని కనీసం ఐదారేళ్ల పాటు కొనసాగిస్తే రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడతారని అన్నారు.
Samayam Telugu rythu


తెలంగాణ వ్యాప్తంగా సుమారు 21 లక్షల బోర్లు ఉన్నాయని, వీటిని మైక్రో-ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భాగంగా పరిగణిస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి తెలిపారు. రైతు బీమా పథకం ప్రారంభించిన తర్వాత 3,740 రైతులకు ఎల్ఐసీ ద్వారా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందజేశామని, దీని వల్ల ఆత్మహత్యలు తగ్గాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ప్రీమియం కింద రూ.2,271 చెల్లించిందని ఆయన తెలిపారు. 28 లక్షల రైతులకు బీమా ప్రీమియం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.636 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. అంతేకాదు, తెలంగాణలో 90 శాతం మంది రైతులు ఐదెకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నారని, వీరందరికి రైతు బీమా వల్ల ఎంతో ప్రయోజనం కలిగిందని పార్దసారథి చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి రైతాంగానికి ఈ పథకం వల్ల లబ్ది చేకూరిందని అన్నారు. బీమా పరిహారంలో 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు అందిందని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.