యాప్నగరం

అందుకే జనగామ సీటు వదులుకున్నా: కోదండరామ్‌

తమకు తక్కువ సీట్లు రావడం, చివర్లో గందరగోళం నెలకొనడంతో ముస్లింలకు ఒక్క సీటు కూడా కేటాయించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 20 Nov 2018, 11:11 pm
కూటమిలో తొలుత తమకు హామీ ఇచ్చిన సీట్లను ఇవ్వలేదని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. 8 సీట్లు ఇస్తామని అధికారికంగా చెప్పినా చివరికి 6 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చిందన్నారు. తమ అభ్యర్థులు ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే సరైన తీరుగా సీట్ల సర్థుబాటు జరగలేదని తెలిపారు.
Samayam Telugu Kodandaram


ముస్లింలకు ఒక్క సీటయినా ఇవ్వాలనుకున్నట్లు తెలిపారు. కానీ తమకు తక్కువ సీట్లు రావడం, చివర్లో గందరగోళం నెలకొనడంతో ముస్లింలకు ఒక్క సీటు కూడా కేటాయించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో సీటు అడిగిన తమకు నిరాశే ఎందురైందని వెల్లడించారు. జనగామ సీటును వదులుకోవడానికి గల కారణాలపై సైతం నోరు విప్పారు. మేడ్చెల్‌లో‌ జరగనున్న సోనియా గాంధీ సభలో పాల్గొనేందుకు తనకు అభ్యంతరాలు లేవన్నారు. తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తి ఉందని, స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

‘మొదటినుంచీ నేను జనగామ సీటును ఆశించా. అక్కడి నుంచి పోటీ చేసి నెగ్గాలనుకున్నా. కానీ బీసీల కోసం జనగామ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. మహాకూటమికి ఇరకాటంలో పడదనుకుంటే జనగామ నాకే ఇవ్వాలని కోరాను. అందర్నీ ఒప్పించే పరిస్థితి లేదని తేల్చడంతో జనగామ సీటుపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్ కావాలని టీజేఎస్‌ అడిగింది. కానీ బీసీ నేత ఆర్‌ కృష్ణయ్యను పోటీకి దింపుతారని ఊహించలేకపోయా’ అని కోదండరామ్‌ పలు విషయాలపై స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.