యాప్నగరం

బీజేపీ ఎంపీ అభ్యర్థిపై 240 కేసులు.. 4 పేజీల్లో పత్రికా ప్రకటన.. అసలు సంగతి ఇదీ!

బీజేపీకి చెందిన ఎంపీ అభ్యర్థిపై 240 కేసులు ఉన్నాయి. వీటిని పేపర్లో ప్రచురించడానికి నాలుగు పేజీలు అవసరమయ్యాయి. ఆయనపై ఇన్ని కేసులు ఉండటానికి ఓ బలమైన కారణం ఉంది.

Samayam Telugu 20 Apr 2019, 5:37 pm
మన దగ్గర ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ నేతలపై 20-30 కేసులుంటేనే అమ్మో అనుకుంటున్నాం. కానీ కేరళలోని పథానంథిట్ట నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కె.సురేంద్రన్‌పై ఏకంగా 240 కేసులున్నాయి. వామ్మో అనుకుంటున్నారా. కాస్త ఆగండి.. ఈ కేసుల వివరాలను పేపర్లో ప్రకటించగా.. నాలుగు పేజీల్లో ముద్రించాల్సి వచ్చింది. పొద్దున్నే పేపర్ చూసిన వాళ్లు ఈ నాలుగు పేజీలను చూసి ఏదో టెండర్ నోటిఫికేషన్ అనుకున్నారు. కానీ కాస్త పరిశీలనగా చూశాక విషయం అర్థమైంది.
Samayam Telugu Surendran-janmabhoomi-750


ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను మూడు ప్రధాన వార్తాపత్రికల్లో లేదా ఒకే పేపర్లో మూడుసార్లు ప్రచురించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఓటర్లకు అతడిపై ఉన్న కేసుల వివరాలు తెలుస్తాయనేది ఈసీ ఉద్దేశం.

వార్తాపత్రికలో నాలుగు పేజీల్లో పబ్లిష్ అయిన వివరాల ప్రకారం కేరళలోని అన్ని జిల్లాల్లోనూ సురేంద్రన్‌‌పై కేసులు ఉన్నాయి. ఈ వివరాలన్నీ చూశాక ఆయన పేరు మోసిన క్రిమినల్ కావచ్చని అనుకోవడం సహజం. కానీ ఆయనపై ఉన్న కేసుల్లో 90 శాతం కేసులు శబరిమల వివాదానికి సంబంధించినవే.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కేరళ వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలకు సురేంద్రన్ నాయకత్వం వహించారు. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి.

మరో విషయం ఏంటంటే.. పేపర్లో నాలుగు పేజీల్లో కేసులను ప్రకటించడానికి కనీసం రూ.20 లక్షలు అవసరం. మూడుసార్లు పబ్లిష్ చేయడానికి రూ.60 లక్షలు అవసరం. ఈసీ నిబంధనల ప్రకారం ఎంపీ అభ్యర్థి గరిష్టంగా రూ.75 లక్షలు మాత్రమే ఖర్చుపెట్టాలి. అంటే సురేంద్రన్ ఇంకా రూ.15 లక్షలు మాత్రమే ప్రచారం కోసం ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కానీ జన్మభూమి పత్రిక బీజేపీకి చెందినది కావడంతో పత్రికా ప్రకటన కోసం తక్కువ వసూలు చేసే అవకాశం ఉంది. శబరిమల వివాదం కారణంగా సురేంద్రన్‌పై సానుభూతి ఉండటంతో.. పథానంథిట్టలో తాము గెలుస్తామని బీజేపీ ధీమాతో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.