యాప్నగరం

Lok Sabha Elections: తొలి దశ పోలింగ్.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 25 శాతం పోలింగ్

దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 పార్లమెంటు స్థానాలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

Samayam Telugu 11 Apr 2019, 12:48 pm
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 పార్లమెంటు స్థానాలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటల సమయానికి దేశవ్యాప్తంగా సగటున 24.32 శాతం పోలింగ్ నమోదయ్యింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కేవలం 15 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. తెలంగాణలో ఇప్పటి వరకూ 26 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఉత్తరాఖండ్‌లో 23.78 శాతం, లక్షద్వీప్‌లో 23.10 శాతం పోలింగ్ జరిగింది. ఇక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన జమ్మూ, బారాముల్లాలో రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 24.66 శాతం పోలింగ్ జరిగింది.
Samayam Telugu loksabha


పశ్చిమ్ బెంగాల్‌లోని రెండు స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ ఇప్పటి వరకూ 38.08 శాతం పోలింగ్ నమోదయినట్టు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవని, క్యూలో గంటల కొద్దీ వేచిచూస్తామని విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల పోలింగ్ రెండు గంటల ఆలస్యంగా మొదలుకావడంతో ఓటింగ్ శాతం తక్కువగా కనిపిస్తోందని సీఈసీ గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు.

పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన ప్రాంతాల్లో సమయాన్ని పెంచే అవకాశాలు లేవని, సాయంత్రం 6 గంటల వరకూ క్యూ లైన్లో ఉన్న అందరికీ ఓటువేసే అవకాశం కల్పిస్తామన్నారు. క్యూలో ఉన్నవారందరూ ఓటువేసేంత వరకూ రాత్రి 9 గంటలైనా పోలింగ్ కొనసాగుతుందని ద్వివేది స్పష్టం చేశారు. వివిధ మీడియా సంస్థల్లో వస్తున్నట్టుగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయనడం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తమ దృష్టికి వచ్చిన అన్ని ఇబ్బందులను పరిష్కరించామని, మరో 24 చోట్లకు సాంకేతిక నిపుణులను పంపినట్టు తెలిపారు. మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని, ఈవీఎంలపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.