యాప్నగరం

మోదీపై పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ

వారణాసి నుంచి పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎస్పీ తరఫున ఆయన వేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది.

Samayam Telugu 1 May 2019, 8:59 pm
ఎన్నికల ముందే యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి షాక్ తగిలింది. వారణాసి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన.. బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేష తిరస్కరణకు గురైంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాన్ని కోల్పోయిన ఎవరైనా ఐదేళ్లలోపే ఎన్నికల్లో పోటీ చేస్తే.. అవిశ్వాసం, అవినీతి కారణంగా డిస్మిస్ కాలేదని ఈసీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. బీఎస్‌ఎఫ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను తేజ్ బహదూర్ ఉదయం 11 గంటల్లోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించ లేకపోయారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించామని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు.
Samayam Telugu tej bahadur


సైనికులకు నాసిరకం సరుకులు అందుతున్నాయని, జవాన్లకు పెట్టే ఆహారంలో నాణ్యత సరిగా లేదని తేజ్ బహదూర్ 2017లో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం సంచలనమైంది. సైన్యం నిబంధనలను అతిక్రమించడంతో బీఎస్ఎఫ్ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అనంతరం ఎన్నికల్లో మోదీపై పోటీ చేస్తానని ప్రకటించిన తేజ్ బహదూర్.. వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి మొగ్గు చూపారు. ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన తర్వాత ఎస్పీ టికెట్ ఆఫర్ చేసింది. దీంతో సమాజ్ వాదీ పార్టీ తరఫున కూడా ఆయన మరో నామినేషన్ వేశారు.

తేజ్ బహదూర్ సమర్పించిన రెండు నామినేషన్లలో తేడాలు ఉండటంతో ఈసీ ఆయనకు నోటీసులిచ్చింది. ఏప్రిల్ 24న సమర్పించిన తొలి నామినేషన్ పత్రాల్లో తాను బీఎస్ఎఫ్ నుంచి డిస్మిస్ అయ్యానని తేజ్ బహదూర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 29న సమాజ్‌వాదీ పార్టీ తరఫున సమర్పించిన నామినేషన్లలో ఉద్యోగం వివరాలను వెల్లడించలేదు. బీఎస్ఎఫ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను కూడా ఆయన సమర్పించాల్సి ఉంది.

కాగా, బీజేపీ ఒత్తిడి వల్లే ఈసీ తన నామినేషన్‌ను తిరస్కరించిందని తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీఎస్ఎఫ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించినప్పటికీ.. తన నామినేషన్ తిరస్కరణకు గురైందన్నారు. మంగవారం సాయంత్రం 6.15 గంటల్లోగా ఆధారాలు సమర్పించాలని ఈసీ ఆదేశించింది. మేం ఆధారాలను కూడా సమర్పించినప్పటికీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ విషయమై మేం సుప్రీం కోర్టుకు వెళ్తామని తేజ్ బహదూర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.