యాప్నగరం

Telangana Elections: శపథం చేస్తున్నా.. 20 లక్షలకు నీళ్లిస్తేనే ఓటడుగుతా: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో 14 స్థానాల్లో మమ్మల్ని గెలిపించండి. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేస్తాం. అలా చేయని పక్షంలో ఓటు అడగనని కేసీఆర్ పాలమూరు ప్రజలను కోరారు.

Samayam Telugu 5 Oct 2018, 6:59 pm
గత ఆరేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరు జిల్లా ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉందో ప్రజలు పోల్చి చూసుకోవాలని వనపర్తి సభలో కేసీఆర్ కోరారు. వచ్చే ఎన్నికలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్‌ను 14 స్థానాల్లో గెలిపించాలని ఆయన ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ‘వనపర్తి సభలో శపథం చేస్తున్నా.. 14 సీట్లలో గులాబీ జెండా ఎగరేస్తే.. 20 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. పచ్చటి పాలమూరును మీకు బహుమతిగా అందిస్తేనే మళ్లీ మిమ్మల్ని ఓట్లు అడుగుతా’నని కేసీఆర్ తెలిపారు.
Samayam Telugu kcr at naglonda


‘కాంగ్రెస్ నాయకులు గురువారం అలంపూర్, గద్వాల్ వచ్చారు. నల్గొండ సభలో పల్లీలు, బఠాణీలు అమ్ముకునేంత మంది కూడా కాంగ్రెస్ సభలకు రాలేదు. సీఎంనైనా నా గురించి సంస్కారం లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. గద్వాల్ చౌరస్తాలో సభ పెట్టి కత్తులు దింపారు. ముందు ముందు వాళ్ల సంగతి చెబుతా’నని కేసీఆర్ హెచ్చరించారు.

ఇప్పటికే పాలమూరులో 7 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయన్న కేసీఆర్.. ఇది కాంగ్రెస్ నాయకులకు ఎందుకు చేతకాలేదని ప్రశ్నించారు. ‘అధికారంలోకి వస్తే.. కుర్చీ వేసుకొని కుర్చొని ప్రాజెక్టులు కట్టిస్తానని చెప్పా, అదే విధంగా కట్టిస్తున్నాం. హరీశ్ సహా మంత్రులంతా కలిసి ప్రాజెక్టుల కాల్వ గట్టు దగ్గరే రాత్రి నిద్రించారు. లేదంటే ఇంకో 20 ఏళ్లయినా నీళ్లొచ్చేవా..?’ అని కేసీఆర్ పాలమూరు ప్రజానీకాన్ని ప్రశ్నించారు.

‘తెలంగాణ వచ్చాక కరెంట్ కష్టాలు పోవాలి, కోటి ఎకరాలకు సాగునీరు అందాలని నిర్ణయించాం. నిష్ణాతులైన దాదాపు 40 మంది రిటైర్డ్ ఇంజినీర్ల ఇందుకోసం ఉపయోగించాం. ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించాం. శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు పారిపోయారో సమాధానం చెప్పాలి. ప్రతిసారి పారిపోవడమే వారికి ఓ తంతుగా మారింది. ఓసారేమో ప్రిపైరే రాలేదన్నారు.. మరెందుకొచ్చా’రంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.