యాప్నగరం

జీశాట్-17 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

భారత కమ్యూనికేషన్ ఉపగ్రహాల జాబితాలో మరో శాటిలైట్ చేరింది. తన 18వ కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-17ను భారత్ గురువారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది.

TNN 29 Jun 2017, 8:35 am
భారత కమ్యూనికేషన్ ఉపగ్రహాల జాబితాలో మరో శాటిలైట్ చేరింది. తన 18వ కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-17ను భారత్ గురువారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని కురు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఫ్రెంచ్ రాకెట్ ఏరియన్-5 ద్వారా జీశాట్-17ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ జీశాట్-17 శాటిలైట్ భారత సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రయోగాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌స్పేస్ కంపెనీ నిర్వహించింది.
Samayam Telugu gsat 17 launched early thursday indias 18th operational communication satellite in orbit
జీశాట్-17 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం


ఫ్రాన్స్ దేశానికి చెందిన 5,780 కిలోల హెల్లాస్‌ శాట్‌-3తోపాటు మనదేశానికి చెందిన 3,477 కిలోల జీశాట్‌-17 ఉపగ్రహాన్ని ఏరియన్‌-5 ఈసీఏ రాకెట్‌ కక్ష్యలోకి చేరవేసింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2.29 నుంచి 3.46 గంటల మధ్య ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగానంతరం 39 నిమిషాలలో తాత్కాలిక భూస్థిర కక్ష్యలోకి జీశాట్‌-17 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మన శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను నియంత్రిస్తూ భూ మధ్య రేఖకు 93.5 డిగ్రీల వాలులో 35 వేల కిలోమీటర్ల వృత్తాకారపు కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని చేరవేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (MCF) శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని పర్యవేక్షిస్తున్నారు.

జీశాట్-17 ఇండియన్ నేషనల్ శాటిలైట్ (INSAT) సిస్టమ్‌లో భాగం. ఈ ఉపగ్రహం 15 సంవత్సరాలు పనిచేస్తుంది. మొబైల్‌ శాటిలైట్‌ సర్వీస్‌ (ఎంఎస్ఎస్‌) సేవల కోసం, ఎస్‌బాండ్‌ డాటా రిలే పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. అలాగే విపత్తు సమయాల్లో సమాచారాన్ని అందించేందుకు దీనిలోని యూహెచ్‌ఎఫ్ బాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉపయోగపడతాయి. కాగా, ఇస్రో కోసం ఏరియన్‌స్పేస్ కంపెనీ ప్రయోగించిన 21వ శాటిలైట్ ఇది. 1981లో యాపిల్‌ ఉపగ్రహాన్ని ప్రెంచ్‌ గయానా నుంచి మనదేశం అంతరిక్షంలోకి ప్రయోగించింది. త్వరలో జీశాట్‌-11 ఉపగ్రహాన్ని కూడా కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఏరియన్‌ స్పేస్‌ ఏజెన్సీతో ఇస్రో ఒప్పందం చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.