యాప్నగరం

గంభీర్ ఒక్క మాట..ఎంత పని చేసింది

జట్టు ఫీల్డింగ్‌కి వెళ్లేముందు కెప్టెన్ గౌతమ్ గంభీర్ పేస్ బౌలర్లతో ఒక్కటే అన్నాడు. మీరు చేసే ప్రదర్శన బట్టే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కనీస పోరాటంతో

TNN 24 Apr 2017, 4:24 pm
Samayam Telugu kipper gautam gambhir asked us to show some pride says chris woakes
గంభీర్ ఒక్క మాట..ఎంత పని చేసింది
ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు ఆదివారం రాత్రి అద్భుతమే చేశారు. భీకర హిట్టర్లున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9.4 ఓవర్లలోనే 49 పరుగులకు కుప్పకూల్చి ఔరా అనిపించారు. 132 పరుగుల తక్కువ స్కోరు మాత్రమే చేతిలో ఉండటంతో ఓటమి తప్పదనుకున్న కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ కనీసం పోరాటంతో పరువు నిలపాల్సిందిగా జట్టు బౌలర్లని కోరాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన పేసర్లు అతడికి ఏకంగా మ్యాచ్‌నే గెలిపించి బహుమతి ఇచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 131 పరుగులకు ఆలౌటవగా.. అనంతరం ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు.. కోల్‌కతా పేసర్లు కౌల్టర్ నైల్ (3/21), క్రిస్ వోక్స్ (3/6), గ్రాండ్ హోమ్ (3/4) ఉమేశ్ యాదవ్ (15/1) ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి 82 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.

తాజాగా క్రిస్ వోక్స్ మాట్లాడుతూ .. ‘జట్టు ఫీల్డింగ్‌కి వెళ్లేముందు కెప్టెన్ గౌతమ్ గంభీర్ పేస్ బౌలర్లతో ఒక్కటే అన్నాడు. మీరు చేసే ప్రదర్శన బట్టే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కనీస పోరాటంతో మమ్మల్ని గర్వపడేలా చేయండన్నాడు. కౌల్టర్ నైల్, ఉమేశ్ యాదవ్ నా కంటే ముందు అద్భుతంగా బంతిని స్వింగ్ చేసి వరుసగా వికెట్లు పడగొట్టారు. కానీ.. నేను బంతిని ఎక్కువగా స్వింగ్ చేయలేదు. అయితే సురక్షిత ప్రాంతంలో వేస్తూ తొలుత లయ అందుకున్నాను. ఎందుకంటే ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్‌మెన్లకు పరుగులు చేసే అవకాశం ఇవ్వకూడదని నా ఉద్దేశం. చివరికి మా వ్యూహం ఫలించింది. బెంగళూరు జట్టు మా పేస్‌కి చిక్కింది’ అని వివరించాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్లు ఒక్కరూ కూడా కనీసం రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోగా.. 10 వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే సమర్పించుకోవడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.