యాప్నగరం

Karimnagar: ఉద్యోగాల పేరుతో ముంచేసిన మోసగాడు.. మధ్యవర్తి ఆత్మహత్య

ఫ్రెండ్‌ని నమ్మి నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి ఇస్తే నిండాముంచేశాడు. బాధితులు తన ఇంటిపైకి రావడంతో ఎలాగో సగం డబ్బులు తిరిగిచ్చేశాడు. కానీ చివరికి..

Samayam Telugu 30 Jul 2020, 8:41 pm
ఉద్యోగాల పేరుతో స్నేహితుడు లక్షలు కాజేసి బోర్డు తిప్పేయడంతో బాధితులకు సమాధానం చెప్పలేక మధ్యవర్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. మోసపోయానన్న అవమానంతో పురుగుల మందు తాగి బలవన్మణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుంభం రవీందర్(43)కి హైదరాబాద్‌కి చెందిన కళ్యాణ్‌తో రెండేళ్ల కిందట పరిచయమైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


తనకు హైదరాబాద్‌లో ఫోర్‌స్క్వేర్‌ కంపెనీ ఉందని, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఎవరైనా ఉంటే పంపించాలని రవీందర్‌కి చెప్పడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమందిని హైదరాబాద్‌ పంపించాడు. కొత్తపల్లికి చెందిన దేవదాసుతో కలిసి కరీంనగర్‌, వరంగల్‌, కోరుట్ల, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది వద్ద 40 లక్షల రూపాయలు తీసుకుని కళ్యాణ్‌కు ఇచ్చాడు.

ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించిన వారికి కళ్యాణ్‌ శిక్షణ ఇప్పించి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ చేతిలో పెట్టాడు. సరిగ్గా నెలరోజులకే కార్యాలయం మూసివేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు మధ్యవర్తిగా సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌ వద్దకు వచ్చి డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో రవీందర్‌ సగం వరకు డబ్బులు చెల్లించాడు. మిగిలిన డబ్బులు చెల్లించలేక.. మోసపోయాన్న అవమానభారంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Also Read: పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లని భర్త.. గర్భవతిని చేసి.. షాద్‌నగర్‌లో దారుణం

కరీంనగర్‌ విద్యానగర్‌‌లోని తన ఇంటిలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన రవీందర్‌ నేరుగా బెడ్రూమ్‌లోకి వెళ్లి పురుగుల మందు తాగేశాడు. నురగలు కక్కుతూ బయటకు రావడంతో కుటుంబ సభ్యులు రవీందర్‌ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు.

Read Also: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం.. పరువు పోతుందని తొక్కిపెట్టిన తల్లి.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.