యాప్నగరం

పరాయి మహిళపై మోజుతో భార్యనే కడతేర్చాడు.. సిద్దిపేటలో దారుణం

శనివారం రాత్రి నిద్రపోతున్న భార్యను గొంతు నులిమి చంపేసిన చుంచుస్వామి పరారయ్యాడు. యాదమ్మ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 10 Aug 2020, 8:49 am
కష్టసుఖాల్లో కడదాకా తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్తే కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది. కొమురవెల్లి మండలం రాంసాగర్‌ గ్రామానికి చెందిన తాడూరి బాలయ్య కూతురు యాదమ్మ(40)ను ఇరవై ఏళ్ల క్రితం చేర్యాలకు చెందిన చుంచు స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. చుంచు స్వామి హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Samayam Telugu చుంచు స్వామి, యాదమ్మ(File Photo)


Also Read: గుంటూరు: రెండేళ్లకే నరకం చూపించిన భర్త.. పెళ్లి రోజే మహిళ ఆత్మహత్య

లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా పని లేకపోవడంతో భార్యబిడ్డలతో సహా రాంసాగర్‌లో అత్తామామలతో కలిసి ఉంటూ వారికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉంటున్నారు. అయితే చుంచు స్వామికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలియడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం అత్తామామలు బంధువుల ఇంటికి వెళ్లడంతో చుంచుస్వామి భార్య, పిల్లలతో కలిసి ఇంట్లోనే పడుకున్నాడు. ఉదయం పిల్లలు నిద్ర లేచేసరికి యాదమ్మ విగతజీవిగా పడి ఉండటం, చుంచుస్వామి కనిపించకపోవడంతో వారు స్థానికులకు చెప్పారు.

Also Read: భర్త మరణం తట్టుకోలేక నర్సు ఆత్మహత్య... అనాథలైన ముగ్గురు పిల్లలు

దీంతో చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను గొంతు నులిమి చంపేసిన ఆనవాళ్లను గుర్తించారు. భర్త లేకపోవడంతో అతడే చంపేసి పరారై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చుంచుస్వామికి పరాయి మహిళతో అక్రమ సంబంధం ఉందని, దాని అడ్డంగా ఉందన్న కక్షతోనే తమ కూతురిని పొట్టన పెట్టుకున్నాడని యాదమ్మ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: కడప: తండ్రీ, కూతుళ్ల ఆత్మహత్య కేసులో షాకింగ్ కోణం.. అసలు కారణం అదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.