యాప్నగరం

డ్రైవింగ్ సరదాకి అన్నదమ్ములు బలి.. విశాఖలో విషాదం

లాక్‌డౌన్ కారణంగా పెద్దకొడుకు శ్రీనివాస్ హైదరాబాద్‌ నుంచి సొంతూరు వచ్చేశాడు. తమ్ముడు హనుమంతుసాయితో కలసి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నాడు. ఇద్దరూ కారులో వెళ్తుండగా మృత్యువు బలితీసుకుంది.

Samayam Telugu 11 Sep 2020, 9:02 am
కారు చెట్టుని ఢీకొట్టిన ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన సోదరులు విగతజీవులుగా మారారు. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లా నాతవరానికి చెందిన చిన్నబ్బాయి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్(31), హనుమంతుసాయి(25). టైలర్‌గా పనిచేస్తున్న చిన్నబ్బాయి కష్టపడి ఇద్దరు పిల్లలను చదివించాడు.
Samayam Telugu ప్రమాదానికి గురైన కారు, మృతి చెందిన అన్నదమ్ములు
accident


పెద్దకొడుకు శ్రీనివాస్ ఎంసీఏ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. చిన్నకొడుకు సాయి ఇంటర్‌తో చదువు ఆపేసి ఊళ్లోనే పాన్‌షాపు పెట్టుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా శ్రీనివాస్ మూడు నెలల కిందట సొంతూరు వచ్చేశాడు. అప్పటి నుంచి అన్నదమ్ములు కలిసే తిరుగుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న అన్నదమ్ములు అదే గ్రామానికి చెందిన వంశీ(25) కారులో బయల్దేరారు.

రాత్రి పదిగంటల సమయంలో కారు నడుపుకుంటూ వెళ్తున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. తాండవ జంక్షన్ దాటి నాతవరం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లి చెట్టుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వంశీకి తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి కావడంతో ఎవరూ ప్రమాద ఘటనను గమనించలేదు. ఉదయం వాకింగ్‌కి వచ్చిన వారు ప్రమాదాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: కారు ఆగిపోయి కామాంధుల కంటపడిన మహిళ.. కన్నబిడ్డల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వంశీని వెంటనే నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. చేతికందివచ్చిన కొడుకులు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిసంద్రంలో మునిగిపోయారు.

Read Also: ఆవారా అల్లుడికి అత్త ఆశ్రయం.. చివరికి.. వరంగల్‌లో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.