యాప్నగరం

నడిరోడ్డుపై నిలిచిన కంటైనర్.. ఏమైందో అని డోర్ కొట్టడంతో షాక్.. సజీవదహనం

కోళ్లఫారం వరకూ వెళ్లొద్దామని స్నేహితులు బైక్‌ బయలుదేరారు. దారిలో నడిరోడ్డుపై కంటైనర్ ఆగి కనిపించింది. ఏమైందో ఏమో అని అడిగేందుకు డోర్ కొట్టి అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

Samayam Telugu 20 Dec 2020, 12:53 pm
కృష్ణా జిల్లాలో కంటైనర్‌కి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు స్నేహితులు సజీవ దహనమైన కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నడిరోడ్డుపై కంటైనర్ ఆగిపోవడంతో బైక్‌పై వస్తూ ఏమైందో అని తెలుసుకునేందుకు డోర్ కొట్టారు. అదే వారి పాలిట శాపమైంది. వారి దారిన వారు పోయిన బతికుండేవారేమో!! ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి విగతజీవులుగా మారారు. మంటల్లో సజీవ దహనమ్యారు. నూజివీడు సమీపంలోని పోలసానపల్లిలో జరిగిన ఈ అత్యంత విషాద ఘటన వివరాలు..
Samayam Telugu తగలబడిపోతున్న లారీ, బైక్
fire accident


జిల్లాలోని మీర్జాపురం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్(65), బాపులపాడు మండలం పెరికీడు గ్రామానికి చెందిన పి.జోజిబాబు(42) స్నేహితులు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా స్నేహం కుదిరింది. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. కోళ్లఫారం వద్దకు వెళ్లి వద్దామని బైక్‌పై బయలుదేరారు. పోలసానిపల్లి వద్ద నడిరోడ్డుపై కంటైనర్ నిలిచిపోయింది. కంటైనర్ బాక్స్ ఎత్తు ఉండడంతో పైన వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్‌ తగిలింది. వెంటనే అప్రమత్తమైన కంటైనర్ డ్రైవర్, క్లీనర్ ఎడమవైపు డోర్‌ని బలంగా తన్ని బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అటుగా వచ్చిన జోజిబాబు, మస్తాన్‌కి విద్యుత్ షాక్ విషయం తెలుసుకోలకపోయారు. కంటైనర్ ఇలా రోడ్డు మీద ఎందుకు ఆగిపోయిందోనని అడిగేందుకు లారీ కుడి వైపు వెళ్లి డ్రైవర్ డోర్ కొట్టారు. అంతే ఒక్కసారిగా కరెంట్ షాక్‌కి గురై బైక్‌పై నుంచి కిందపడిపోయారు. షాక్ కారణంగా మంటలు చెలరేగాయి. బైక్‌లోని పెట్రోల్ తోడవడంతో అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. స్థానికులు, గ్రామస్తులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.