యాప్నగరం

వింత జీవులు కాదు.. జీలుగు పక్షి పిల్లలు!

పుట్టిన కొద్ది రోజుల వరకూ ఆ పక్షి పిల్లల శరీరంపై వెంట్రుకలు ఉండవని, దీంతో వాటి గురించి తెలియని వారు వింత జీవుల్లా భావించారని అటవీశాఖ అధికారి సంతోష్ తెలిపారు. అవి నిశాచర జీవులు కావడం వల్ల చీకట్లో మాత్రమే చూడగలుగుతాయని ఆయన చెప్పారు.

Samayam Telugu 26 Nov 2018, 6:12 pm
ఏలియన్స్, వింత జీవులు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విశాఖపట్నం పక్షుల గుట్టు వీడింది. అవేవో వింత జీవులు కావని, జీలుగు పక్షి పిల్లలేనని అటవీ అధికారులు తేల్చి చెప్పారు. వాటిని నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు అప్పగించినట్లు తెలిపారు. ‘ఆ మూడూ.. విశాఖ పరిసర ప్రాంతాల్లో కనిపించే గుడ్లగూబ జాతికి చెందిన రకం పక్షి పిల్లలే. వాటిని తెలుగులో జీలుగు పక్షులుగా వ్యవహరిస్తారు’ అని వన్యప్రాణి పరిశోధకుడు, వైల్డ్‌లైఫ్‌ నిపుణుడు సంతోష్‌ తెలిపారు. ఆ పక్షిని ఆంగ్లంలో ‘బార్న్‌ ఓల్‌’ అని పిలుస్తారని ఆయన తెలిపారు.
Samayam Telugu image


ఆ పక్షి పిల్లలను కొంత కాలం అక్కడే ఉండనిస్తే.. తల్లి సంరక్షణలో ఆరోగ్యంగా ఉండేవని, ప్రస్తుతం వాటి ఆరోగ్యం క్లిష్టంగా ఉందని అధికారులు తెలిపారు. తల్లి వాటికి తగిన ఆహారాన్ని అందించి ఉండేదని వారు చెప్పారు. ‘ఆ పక్షి పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కోడి మాంసం ఆహారంగా అందించారు. అటవీ అధికారులు తొందరపడి వాటిని తరలించారు. తల్లి నుంచి వేరు పడటంతో వాటికి బతికే అవకాశాలు సన్నగిల్లాయి’ అని వారు చెప్పారు.

Also Read: వైజాగ్‌లో వింత ఆకారాలంటూ ప్రచారం!

పుట్టిన కొద్ది రోజుల వరకూ ఆ పక్షి పిల్లల శరీరంపై వెంట్రుకలు ఉండవని, దీంతో వాటి గురించి తెలియని వారు వింత జీవుల్లా భావించారని సంతోష్ తెలిపారు. అవి నిశాచర జీవులు కావడం వల్ల చీకట్లో మాత్రమే చూడగలుగుతాయని ఆయన చెప్పారు.

‘తల్లి పక్షి దీనికి ఆహారం సమకూరుస్తుంది. ఇవి చాలా సున్నితమైనవి. వాటిని అతిగా ఫొటోలు తీయడం, ఇతరత్రా ఇబ్బందులు పెట్టడం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ పక్షులు ఎలుకలు, పంది కొక్కులను తిని రైతులకు మేలు చేస్తాయి’ అని సంతోష్ తెలిపారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.