యాప్నగరం

కేజ్రీవాల్‌కు షాక్... 20 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు!

లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

Samayam Telugu 21 Jan 2018, 4:10 pm
లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. లాభదాయక పదవుల్లో ఉన్నందుకు గానూ 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా ఎన్నికల సంఘం రెండు రోజుల కిందట రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి నిర్ణయంతో దిల్లీ అసెంబ్లీలో ఆప్‌ బలం 45కి పడిపోయింది. మొత్తం 70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2015 ఎన్నికల్లో 66 సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే.
Samayam Telugu 20 aap mlas disqualified from delhi assembly for holding office of profit
కేజ్రీవాల్‌కు షాక్... 20 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు!


రాష్ట్రపతి నిర్ణయంతో 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడిన వారిలో మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌, శాసన సభ్యులు అల్కా లాంబా, ఆదర్శ్ శాస్త్రి, సంజీవ్ ఝా, రాజేశ్ గుప్తా, విజేందర్ గార్గ్, ప్రవీణ్ కుమార్, శరద్ కుమార్, మదన్‌లాల్ కుఫ్యా, శివ్ చరణ్ గోయల్, సరిత సింగ్, నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, అనిల్ కుమార్, సోమ్ దత్, అవతార్ సింగ్, సుఖ్వీర్ సింగ్ దాలా, మనోజ్ కుమార్, నితిన్ త్యాగి ఉన్నారు. ఆప్‌ను చెందిన 21 మంది ఎమ్మెల్యేలు 2015, మార్చి 13 నుంచి సెప్టెంబరు 8, 2016 వరకు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగడంతో లాభదాయక పదవులను చేపట్టారని, దీంతో వీరంతా అనర్హులవుతారని ఈసీ ప్రతిపాదనలను పంపించింది.

ఈ 21 మంది ఎమ్మెల్యేలలో ఒకరు ఇటీవలే పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు దిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆప్, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. ఈసీ నిర్ణయాన్ని భాజపా, కాంగ్రెస్‌లు స్వాగతించాయి. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.