యాప్నగరం

మందుపాతరతో పోలీసుల వాహనం పేల్చివేత.. ఏడుగురు మృతి

దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలోని చోల్నార్- కిరండుల్ గ్రామాల మధ్య రహదారి పనుల గస్తీ విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రతా సిబ్బంది వాహనాన్ని మందుపాతరను ఉపయోగించి పేల్చేయడంతో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు.

Samayam Telugu 21 May 2018, 7:54 am
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పోలీసుల వాహనమే లక్ష్యంగా శక్తివంతమైన మందుపాతర పేల్చారు. దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలోని చోల్నార్- కిరండుల్ గ్రామాల మధ్య రహదారి పనుల గస్తీ విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రతా సిబ్బంది వాహనాన్ని మందుపాతరను ఉపయోగించి పేల్చేయడంతో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో పోలీసును వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. కిరండోల్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బచేలి-చోల్నార్‌ రహదారి నిర్మాణం జరుగుతుండటంతో పనుల వద్ద గస్తీ నిర్వహించేందుకు దంతెవాడ జిల్లా పోలీస్, ఏఆర్‌ బలగాలకు చెందిన ఏడుగురు ఉదయం 11 గంటలకు బొలెరో వాహనంలో బయల్దేరారు. నిర్మాణ సామాగ్రి వాహానానికి ఎస్కార్ట్‌గా బయలుదేరిన సమాచారాన్ని ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు మాటువేశారు.
Samayam Telugu మావోయిస్టులు


చోల్నార్- కిరండుల్ మధ్య ఓ కల్వర్ట్ సమీపంలోకి పోలీసులు వాహనం రాగానే అక్కడ అమర్చిన శక్తిమంతమైన మందుపాతరను పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం వంద అడుగులపైకి ఎగిరి, పక్కనే ఉన్న వాగులో పడి తునాతునకలైంది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్‌ రామ్‌కుమార్‌ యాదవ్‌, ఏఆర్‌ సిబ్బంది పీకే స్వర్గువ్‌, సాలిగ్రమ్‌, విక్రమ్‌ యాదవ్‌, రాజేశ్‌ సింహ్‌, వీరేంద్రనాథ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అర్జున్‌ రాజ్‌వరన్ హెలికాప్టర్‌లో హుటాహుటిన బచేలీ ఆసుపత్రికి తరలించారు. మందుపాతర పేల్చిన నక్సలైట్లు ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47లు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్సాస్‌ ఆయుధాలతోపాటు గ్రనేడ్‌లను ఎత్తుకెళ్లినట్టు బస్తర్‌ డీఐజీ రతన్‌లాల్‌ డాంగ్‌ తెలిపారు.

మంగళవారం బచేలీలో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ వికాస్‌ యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో మావోలు ఘాతుకానికి పాల్పడటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులకు గట్టిగా బదులుచెబుతామని సీఎం రమణ్‌సింగ్‌ హెచ్చరించారు. మావోల దాడి విషయం తెలిసిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగి, ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి. ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్లలో వరుస ఎదురుదెబ్బలు తగిలి అనేక మంది అనుచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.