యాప్నగరం

ఎంత ఘోరం.. బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టారు, ఊపిరాడక మృతి

Tamil Nadu: భార్య, పిల్లలు లేని 80 ఏళ్ల వృద్ధుడిని ఆయన తమ్ముడు బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టిన దారుణం తమిళనాడులోని సేలంలో చోటు చేసుకుంది. చలికి వణుకుతూ, ఊపిరాడక ఆ వృద్ధుడు ప్రాణాలు విడిచాడు.

Samayam Telugu 18 Oct 2020, 4:00 pm
ప్రైవేట్ కంపెనీకి మేనేజర్‌గా పనిచేసిన 80 ఏళ్ల ఆ వృద్ధుడు బతికినంత కాలం ఏ లోటూ లేకుండా బతికాడు. కానీ, ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య ఏడాది కిందటే మృతి చెందింది. మూడు రోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. కానీ, ఆయన తమ్ముడు బతికుండానే ఆయణ్ని ఫ్రీజర్‌లో పెట్టాడు. గుండె కొట్టుకుంటున్నా ఎప్పుడెప్పుడు చనిపోతాడా అని రాత్రంతా ఎదురుచూశాడు. చివరికి పోలీసులకు విషయం తెలియడంతో వారు ఆ వృద్ధుడిని హాస్పిటల్‌లో చేర్పించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Tamil Nadu Old man dies after after locked in corpse freezer for 24 hours


సేలం కందపట్టి హౌసింగ్‌ బోర్డుకు చెందిన రిటైర్డ్‌ మేనేజర్ బాలసుబ్రమణ్యం కుమార్‌ (80)కు భార్య, పిల్లలు లేకపోవడంతో తన సోదరుడు శరవణన్, ఇతర బంధువులతో కలిసి హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల కిందట ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే.. ఆయన ఆరోగ్యం విషమించిందని.. బతికే పరిస్థితి లేదని వైద్యులు చెప్పారు. దీంతో బాలసుబ్రమణ్యం తమ్ముడు మంగళవారం ఆయణ్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు.

బాలసుబ్రమణ్యం శరీరంలో ఎలాంటి చలనం లేకపోవడంతో.. ఇక తన అన్నయ్య బతకడని శరవణన్ భావించాడు. ఫ్రీజర్‌ బాక్స్‌ను ఇంటికి తెప్పించి బాలసుబ్రమణ్య కుమార్‌ కాళ్లు, చేతులను కట్టి మృతదేహంలా చాపలో చుట్టి అందులో పడుకోబెట్టాడు. ఆయన శరీరం చచ్చుబడ్డా.. హృదయ స్పందన తెలుస్తుండటంతో, ఆ శబ్దం ఎప్పుడు ఆగుతుందా అని రాత్రంతా ఎదురు చూశాడు.

Tamil Nadu man death


బాలసుబ్రమణ్యం మరో తమ్ముడు చంద్రమౌళి ఆయన అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఎవరి ఏర్పాట్లలో వారుండగా.. బుధవారం ఉదయాన్నే ఫ్రీజర్‌ బాక్స్‌ అద్దెకు ఇచ్చిన వ్యక్తి శరవణన్‌ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాలసుబ్రమణ్యం కుమార్‌ శరీరంలో చలనాన్ని గుర్తించి అతడు షాక్‌కు గురయ్యాడు. ఇలా బతికుంగానే ఫ్రీజర్‌లో పెట్టారేంటని శరవణన్‌ను నిలదీశాడు. అయినా అతడు ఖాతరు చేయలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఫ్రీజర్‌లో చలికి వణుకుతూ..
బాలసుబ్రమణ్యంను బతికుండగానే ఫ్రీజర్‌లో ఉంచిన దృశ్యాలను వీడియో తీశారు. ఫ్రీజర్‌లో ఆయన చలికి వణికిపోతుండటం, ఆయన గుండె కొట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యం కుమార్‌ను బయటకు తీసి, అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. రెండు రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (అక్టోబర్ 16) ఆయన మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులో ప్రకంపనలు రేపుతోంది. మానవతావాదులను కంటతడి పెట్టిస్తోంది.

బతికుండగానే 24 గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టడం వల్ల వృద్ధుడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన మృతి చెందినట్లు శుక్రవారం ధ్రువీకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన శరవణన్‌పై, ప్రైవేట్ హాస్పిటల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Must Read: కుమారుణ్ని కాపాడటానికే ఆ బిడ్డకు జన్మనిచ్చారు.. డోన్ట్ మిస్!

Also Read: అమ్మాయిల పెళ్లి వయసు పెంపు.. త్వరలోనే నిర్ణయం

Don't Miss: మూసీకి ఎన్నడూ లేనంత వరద.. డ్యామ్‌కు ప్రమాదం ఉందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.