యాప్నగరం

సుక్మా ఎటాక్: 9 మంది మావోయిస్టులు అరెస్ట్

ఏప్రిల్ 24న చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలోని బుర్కాపల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 25 మంది...

TNN 7 May 2017, 10:07 am
ఏప్రిల్ 24న చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలోని బుర్కాపల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టి చత్తీస్‌ఘడ్ అడవులని జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు శనివారం చత్తీస్‌ఘడ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 19 మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 9 మంది మావోలు సుక్మా ఎటాక్‌కి పాల్పడినట్టుగా పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ 9 మంది మావోయిస్టుల్లో ఆరుగురిని చింతగుఫా పోలీసు స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురిని చింతల్‌నర్ పోలీసు స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసినట్టు సుక్మా జిల్లా ఏఎస్పీ జీతేంద్ర శుక్లా పీటీఐకి తెలిపారు.
Samayam Telugu 9 maoists behind sukma attack among 19 arrested in chhattisgarh
సుక్మా ఎటాక్: 9 మంది మావోయిస్టులు అరెస్ట్


చింతగుఫా, చింతల్‌నర్, బుర్కాపల్ ప్రాంతాల్లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్, కోబ్రా, సుక్మా డిస్ట్రిక్ట్ ఫోర్స్ బలగాలు మరో 12 మంది వరకు అనుమానితులని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.

చింతగుఫా నుంచి అరెస్ట్ అయిన వారిలో సోధి లింగ(30), సోధి ముడ(45), పొడియం జోగ(38), మడ్కం భీమ(18), రవ అయ్‌ట(20), మడ్కం సోమ్డు ( 34) వుండగా వెట్టి మల్ల(26), ముచక్కి నంద(39), మద్వి కోసా(40) చింతల్‌నర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా దండకారణ్యం ఆదివాసి కిసాన్ మజ్దూర్ సంఘటన్ దళంలో చురుకుగా పనిచేస్తున్నారని ఏఎస్పీ జీతేంద్ర పేర్కొన్నారు.

సీఆర్పీఎస్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, డిస్ట్రిక్ట్ ఫోర్స్ కుకనూర్ అటవీ ప్రాంతంలో సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో మరో 10 మంది మావోయిస్టులని అరెస్ట్ చేశారు పోలీసులు. కుకనూర్‌లో రెండు ట్రక్కులు తగలబెట్టడం, జగదల్‌పూర్-సుక్మా నేషనల్ హైవేపై విధుల్లో వున్న పెట్రోలింగ్ పార్టీపై కాల్పులు జరిపిన ఘటనల్లో ఈ 10 మంది మావోయిస్టుల హస్తం వుందని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.