యాప్నగరం

Mumbai Coronavirus Death ముంబైలో కరోనాతో మరో వ్యక్తి మృతి.. మహారాష్ట్రలో 101కి చేరిన కోవిడ్ బాధితులు

దేశంలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి లాక్‌డౌన్‌ విధించాయని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 560 జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నట్లు వెల్లడించింది.

Samayam Telugu 24 Mar 2020, 1:45 pm
దేశంలో కరోనా వైరస్‌తో మరో వ్యక్తి మృతిచెందాడు. దీంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 10కి చేరుకుంది. ఇటీవలే యూఏఈ నుంచి వచ్చిన మృతుడికి (65) కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడయ్యింది. దీంతో, అతడ్ని చికిత్స కోసం ముంబయిలోని కస్తూర్బా గాంధీ హాస్పిటల్‌లో చేర్పించారు. బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే, వైరస్ బారినపడి ముగ్గురు మృతిచెందారు.
Samayam Telugu cioivid15


దేశంలో తొలి కోవిడ్ మరణం కర్ణాటకలో సంభవించగా.. ముంబైకి చెందిన ఇద్దరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, బిహార్‌లలో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. బిహార్‌లో మరణించిన వ్యక్తికి 38 ఏళ్లు కాగా.. మిగతా అందరూ 60 ఏళ్ల పైబడిన వారే. తాజాగా, పదో మరణం కూడా మహారాష్ట్రలోనే చోటుచేసుకుంది. సోమవారం మహారాష్ట్రలో 23 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం వరకు మరో నలుగురి వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 101కి చేరింది. మంగళవారం నిర్ధారణ అయిన కేసుల్లో మూడు పుణే, ఒకటి సతారాలో బయటపడినట్టు అధికారులు తెలిపారు. వీరిని హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించిన చికిత్స అందజేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌తో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితులు, ఆర్థిక అంశాలపై ప్రకటన ఉంటుందని ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడనున్నట్టు ఆమె తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.