యాప్నగరం

దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య.. పురుషులే అత్యధికం: ఎన్సీఆర్బీ రిపోర్ట్

గతేడాది దేశవ్యాప్తంగా 1.40 లక్షల మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో దాదాపు 32 శాతం మంది రైతులు, రోజువారీ కూలీలే ఉండటం బాధాకరం. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక్కరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Samayam Telugu 2 Sep 2020, 1:47 pm
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన 2019 నివేదిక ప్రకారం.. దేశంలో గతేడాది 1,39,123 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక్కరు బలవన్మరణానికి పాల్పడినట్టు పేర్కొంది. మొత్తం ఆత్మహత్యల్లో సింహభాగం రైతులు, రోజువారీ కూలీలే 42,480 మంది ఉన్నట్టు తెలిపింది. ఇక, దేశంలోనే అత్యధిక ఆత్మహత్య ఘటనలు నమోదయిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక నిలిచాయి. మహారాష్ట్రలో 18 వేల మందికిపైగా గతేడాది ఆత్మహత్య చేసుకున్నారు.
Samayam Telugu దేశంలో ఆత్మహత్యలు
suicides in India


తమిళనాడులో 13 వేలు, పశ్చిమ బెంగాల్‌లో 13 వేలు, మధ్యప్రదేశ్‌ 12,457 మంది, కర్ణాటక 11,288 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 49.5 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇక, తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 2,858 మంది కూలీలే ఉండడం గమనార్హం. అలాగే, 499 మంది రైతులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. 6,465 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ తర్వాతి స్థానంలో నిలిచింది.

పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్, చండీగఢ్, డామన్ అండ్ డయ్యు, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకపోవడం ఊరటకలిగించే అంశం. సామూహిక/ కుటుంబ ఆత్మహత్యల్లో 16 ఘటనలతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, 14 ఘటనలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని తాజా నివేదిక తేటతెల్లం చేసింది. 2019లో సగటున రోజుకు 381 ఘటనలు చోటుచేసుకోగా.. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. గతేడాది 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది అధికం. 2018లో 1,34,516 మంది ఆత్మహత్యకు పాల్ప్డారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో పురుషులు 42,480 మంది ఉండగా, మహిళల 29.8 శాతంగా ఉన్నారు.

వివాహం తర్వాత ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో పురుషుల సంఖ్యే అధికంగా ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. వివాహం తర్వాత 68.4 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పగా, 62.5 శాతం మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, నగరాల్లోనే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉన్నట్టు తాజా నివేదిక తెలిపింది. ఆత్మహత్య ఘటనల్లో 53.6 శాతం ఉరేసుకోగా, 25.8 శాతం మంది విషం తాగడం, 5.2 శాతం మంది నీళ్లలో దూకడం, 3.8 శాతం నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు.

కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది, వైవాహిక జీవితం కారణంగా 5.4 శాతం మంది, అనారోగ్య కారణాలతో 17.5 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.