యాప్నగరం

ఆగ్రాలో అపూర్వ స్వాగతం.. కళాకారుల ప్రదర్శనకు ముగ్దులైన ట్రంప్, మెలానియా

అహ్మదాబాద్ పర్యటన ముగించుకుని తాజ్‌మహల్ సందర్శనకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌నకు యూపీ ప్రభుత్వం కూడా స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేసింది.

Samayam Telugu 24 Feb 2020, 4:36 pm
భారత పర్యటనకు తొలిసారి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఘనస్వాగతం లభించిన విషయం తెలిసిందే. భారతీయుల తనపై చూపుతోన్న ఆదరాభిమానాలకు ట్రంప్ ఉబ్బితబ్బుబ్బి అవుతున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌లోని మోతెరా స్టేడియం వరకు దారిపొడవునా ప్రజలు ఆయనకోసం బారులు తీరారు. ఇక, మోతెరా స్టేడియం సైతం జన సంద్రంగా మారింది. తన పర్యటనకు ఇంతస్థాయిలో ప్రజలు హాజరుకావడంతో ట్రంప్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రేమకు చిహ్నమైన పాలరాతి సౌధం తాజ్‌మహల్ సందర్శనకు భార్య మెలానియాతో కలిసి ట్రంప్ ఆగ్రా చేరుకున్నారు.
Samayam Telugu agra


ఆగ్రా విమానాశ్రయంలో ట్రంప్‌ను యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు స్వాగతం పలికారు. యూపీ సంప్రదాయం, సంస్కృతికి అద్దంపడుతూ వాయిద్యాలు, నృత్యాలతో కళాకారులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని ట్రంప్, మెలానియా ఎంతో ఆసక్తిగా తిలకించారు. అక్కడి నుంచి తాజ్‌మహల్‌కు బయలుదేరిన ట్రంప్‌నకు 25 వేల మంది విద్యార్థులు ఆగ్రా ఎయిర్‌పోర్ట్ నుంచి తాజ్‌మహల్ వరకు గల 13 కిలోమీటర్ల పొడవునా భారత్, అమెరికా జాతీయ జెండాలను పట్టుకుని ట్రంప్‌కు స్వాగతం పలికారు.

మరోవైపు, ట్రంప్ పర్యటన నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కశ్మీర్ అంతటా అదనపు బలగాలను మోహరించారు. ‘ప్రథమ మహిళ, తాను ఈ దేశంలోని ప్రతి పౌరుడికి సందేశం ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా 8000 మైళ్ల దూరం ప్రయాణించాం. అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుంది.. భారతదేశాన్ని గౌరవిస్తుంది.. అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ భారత ప్రజలకు నిజమైన, హృదయపూర్వక స్నేహితులుగా ఉంటారు’ అంటూ ట్రంప్ హిందీలో మరో ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.