యాప్నగరం

దినకరన్‌కు షాక్... 18 మందిపై అనర్హత వేటు!

జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ చదరంగం రసవత్తరంగా సాగుతోంది. రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

TNN 18 Sep 2017, 12:10 pm
జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ చదరంగం రసవత్తరంగా సాగుతోంది. రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా శశికళ, దినకరన్‌లకు ముఖ్యమంత్రి పళనిస్వామి షాక్ ఇచ్చారు. దినకరన్ వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. వీరిపై స్పీకర్ ధన్‌పాల్ అనర్హత వేటు వేశారు. పార్టీ విప్‌ను ఈ 18 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని... అందుకే వీరిపై వేటు వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. శశికళ వర్గాన్ని కోలుకోకుండా చేసే క్రమంలో పళనిసామి వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షకు ముందు వీరిని అనర్హులుగా ప్రకటించడంతో... రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
Samayam Telugu aiadmk faction feud disqualify 18 mlas
దినకరన్‌కు షాక్... 18 మందిపై అనర్హత వేటు!


తమిళనాడు ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు చైన్నైకి వస్తున్న రోజే దినకరన్ వర్గంపై వేటు పడటం గమనార్హం. మరోవైపు, స్పీకర్ నిర్ణయంపై దినకరన్ వర్గీయులు భగ్గుమన్నారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు. జయలలిత స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వంను రెండు నెలల్లోనే ఆ పదవి నుంచి తప్పించారు. తాను సీఎం పీఠాన్ని అధిరోహించాలని జయ నెచ్చలి శశికళ కలగన్నారు. దీనికి అనుగుణంగానే పన్నీర్‌తో రాజీనామా చేయించారు. అయితే చివరి నిమిషంలో పన్నీర్ ఆమెకు ఎదురుతిరగడంతో మొత్తం పరిస్థితి తారుమారైంది.

ఈలోగా అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా పేర్కొంటూ తీర్పు వెల్లడించడంతో ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. దీంతో తన చెప్పుచేతల్లో ఉంటాడని పళనిసామిని ముఖ్యమంత్రిగా నియమించిన చిన్నమ్మ, తనకు సీఎం కుర్చీ దక్కకుండా చేసినవారిపై ప్రతీకారం తీర్చుకుంటానని జయ సమాధి సాక్షిగా శపథం చేశారు. అయితే ఆమె జైలుకు వెళ్లిన తర్వాత పళనిసామి తన రాజకీయాలను బయటపెట్టారు.

దినకరన్ వర్గం ఎమ్మెల్యేలతో పాటు డీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్‌ చేయడానికి పళనిస్వామి వర్గం తగ్గ కార్యాచరణ సిద్ధం చేసి, సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.