యాప్నగరం

ఉగ్రవాదుల శవాలను తాడుకట్టి లాగిన జవాన్లు

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది.

TNN 17 Sep 2017, 9:55 am
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. అయితే ఆ ఉగ్రవాదుల శవాలపై ఆర్మీ జవాన్లు అతి కఠినంగా వ్యవహరించడాన్ని కొంత మంది విమర్శిస్తున్నారు. శ్రీనగర్‌ శివారులోని నౌగామ్‌లో ఉన్న అరిబాగ్ ప్రాంతంలో గురువారం ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చంపేసింది. వీరిలో ఒకరు లష్కరే తొయిబా కమాండర్ అబు ఇస్మాయిల్ కాగా, అతని సహాయకుడు అబు ఖాసిమ్. అయితే వీరిని మట్టుబెట్టిన అనంతరం శవాలను బయటికి ఈడ్చిన ఆర్మీ జవాన్లు వారి గుండెలపై బూటు కాళ్లతో తన్నారు. అలాగే కాళ్లకు తాడుకట్టి ఈడ్చుకుంటూ వచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో లష్కరే సానుభూతి పరులతో పాటు, మానవహక్కుల సంఘాలు ఆర్మీపై విరుచుకుపడుతున్నాయి.
Samayam Telugu army takes note of video showing troops dishonouring militants bodies
ఉగ్రవాదుల శవాలను తాడుకట్టి లాగిన జవాన్లు


ఈ సంఘటనపై రక్షణ శాఖ స్పందించింది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని, బాధ్యులపై తగిన చర్యలు చేపడతామని శ్రీనగర్‌కు చెందిన రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియా వెల్లడించారు. కాగా, సైనికుల కాల్పుల్లో మరణించిన ఇస్మాయిల్ అమర్‌నాథ్ యాత్ర ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి. జులై నెలలో భక్తులతో అమర్‌నాథ్ వెళ్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్లాన్ చేసింది ఇస్మాయిలే. అందుకే ఆగ్రహంతో ఊగిపోయిన జవానులు అతన్ని చంపిన తరవాత కూడా కసితీరక తాళ్లతో లాక్కొచ్చారు.

కాగా, ఈ చర్యను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఎంతో మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను ఈడ్చుకురాక పతకాలతో సన్మానించాలా? అని ప్రశ్నిస్తున్నారు. అమాయకులు చనిపోయినప్పుడు లేవని నోళ్లు.. ఓ దుర్మార్గుడిని బూటు కాళ్లతో తన్నినప్పుడు ఎందుకు లేస్తున్నాయని అడుతున్నారు. మరోవైపు జవాన్ల చర్యలపై లష్కరే తొయిబా మండిపడింది. భారత్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని లష్కరే ఉగ్రవాది మెహమూద్ షా హెచ్చరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.