యాప్నగరం

సీరం అగ్నిప్రమాదంలో ఘోర విషాదం.. ఐదుగురి మృతి

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాద ఘటన విషాదం నింపింది. ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Samayam Telugu 21 Jan 2021, 8:54 pm
ఫార్మా సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో అగ్ని ప్రమాదం ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సీరమ్ సంస్థకు చెందిన నూతన గురువారం (జనవరి 21) మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పుణేలోని మంజ్రీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఈజెడ్‌-3 భవనంలో నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంతో భవనంలో భారీగా పొగలు అలుముకున్నాయి.
Samayam Telugu సీరం అగ్నిప్రమాదం
Serum Fire accident


ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడానికి రెండు గంటల సమయం పట్టింది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఘటనా స్థలంలో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మరోసారి చెలరేగాయి. తొలుత మంటలు ఎగసిపడిన ప్రాంతంలోనే రెండోసారి అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తెలిపారు.


ప్రమాద ఘటనపై సీరం సంస్థ అధినేత అదర్‌ పూనావాలా స్పందించారు. ‘ఇప్పుడే కొన్ని బాధను కలిగించే విషయాలు తెలిశాయి. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు కొంత ప్రాణనష్టం జరిగినట్టు తెలిసింది. చాలా బాధపడుతున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.