యాప్నగరం

ఒడిశాలో ఘోర ప్రమాదం: ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 9 మంది మృతి

రాయగఢ జిల్లా టిక్రీకి వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైన ఘటన ఒడిశాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

Samayam Telugu 29 Jan 2020, 11:17 am
ఒడిశాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంజాం జిల్లాలోని తాప్తిపానీ ఘాటీ బ్రిడ్జ్‌ వద్ద బస్సు బోల్తాపడిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, మరో 41 మంది గాయపడ్డారు. బస్సు బరంపురం నుంచి రాయగఢ్ జిల్లా టిక్రీకి వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు తాప్తిపానీ వద్ద అదుపుతప్పి బ్రిడ్జ్ పై నుంచి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులోని 50 మందికి గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిలో తొమ్మిది మంది ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బరంపురం, దిగాపహందీ హాస్పిటల్‌కు తరలించారు.
Samayam Telugu odisha


ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ చోట టీ తాగి, బయలుదేరిన కొద్దిసేపటికే బస్సు బ్రేకులు చెడిపోయినట్టు డ్రైవర్ అన్నాడని తెలిపారు. ఆయన చెప్పిన కొద్దిసేపటికే బస్సు అదుపుతప్పి బోల్తాపడిందని పేర్కొన్నారు. బస్సు 30 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిందని డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర స్వానీ తెలియజేశారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను అతికష్టంతో బయటకు తీశారు. కాళ్లు, చేతులు కిటికీల నుంచి బయటకు వచ్చి వెళాడినట్టు ఆయన వివరించారు.

మొత్తం నాలుగు ఫైర్ ఫైటింగ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అటవీ ప్రాంతంలో ప్రమాదం జరగడం, చుట్టూ నీళ్లు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. బరంపురం ప్రాంతానికి చెందిన ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించినట్టు గంజాం ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను వైద్యం కోసం బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చేర్పించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.