యాప్నగరం

కశ్మీర్: ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం

బుధవారం శ్రీనగర్ ఫతేకడల్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఓ జవాన్ సైతం అమరుడైన విషయం తెలిసిందే.

Samayam Telugu 19 Oct 2018, 3:38 pm
జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా బొనియార్‌ పట్టణంలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి నాలుగు ఏకే-47 రైఫిల్స్ సహా భారీ సంఖ్యలో ఆయుధాలు కలిగిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి బొనియార్‌ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు చొరబాట్లకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు తెలపడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
Samayam Telugu Encounter


భద్రతా దళాల చేతిలో హతమైన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. వారు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులనేది ఇంకా తెలియరాలేదని ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. శ్రీనగర్‌లోని ఫతేకడల్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన రెండో రోజునే తాజా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. శ్రీనగర్ కాల్పుల్లో ఓ జవాన్ సైతం అమరుడయ్యాడు. మరోవైపు గురువారం రాత్రి పుల్వామాలో ఉగ్రవాదులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. పుల్వామాలో సైన్యం సోదాలు నిర్వహిస్తుండగా ఈ ఘటన సంభవించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.