యాప్నగరం

పాక్ జిందాబాద్ నినాదాలు.. అమూల్యకు బిగుస్తున్న ఉచ్చు

Bengaluru: సీఏఏ సభలో పాక్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లినా చుట్టు ఉచ్చు బిగిస్తోంది. బెయిల్ కోరుతూ ఆమె చేసుకున్న దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది.

Samayam Telugu 11 Jun 2020, 11:58 pm
బెంగళూరులో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న ఓ సభలో పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసి సంచలనం సృష్టించిన విద్యార్థిని అమూల్య లినాకు కోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూర్‌ కోర్టు తోసిపుచ్చింది. ఈ ఘటనలో ఆమె దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అమూల్యను విడుదల చేస్తే ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని.. పారిపోయే ప్రమాదం కూడా ఉందనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. బెయిల్ దరఖాస్తును రద్దు చేసింది.
Samayam Telugu అమూల్య లినా
Amulya Leona Case


లాక్‌డౌన్‌ కారణంగా తన బెయిల్ పిటిషన్ విచారణలో చాలా జాప్యం జరిగిన నేపథ్యంలో అనుకూలంగా తీర్పు వస్తుందేమోనని అమూల్య భావించింది. కానీ, అలా జరగలేదు. ఫిబ్రవరి 20న బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ తన ప్రసంగం పూర్తి చేసి వెనుదిరుగుతుండగా.. మైక్ అందుకున్న అమూల్య ఒక్కసారిగా పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేపింది. అప్రమత్తమైన ఓవైసీ వెంటనే ఆమె చేతిలో నుంచి మైక్‌ను లాగేసుకున్నారు. అమూల్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తామంతా భారత్‌ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని అసదుద్దీన్ ఓవైసీ వేదికపైనే అమూల్యను వారించారు. యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ‘ఇలా జరుగుతుందని భావిస్తే అసలు ఈ సభకే రాకుండా ఉండేవాణ్ని’ అని నిర్వాహకుల వద్ద ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ర్యాలీలో అలజడి రేపిన అమూల్యపై బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని దేశద్రోహం కేసు నమోదు చేశారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తూ.. అమూల్య ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించారని కోర్టుకు నివేదించారు.

Photo Credit: The New Indian Express

Also Read: చైనా సరిహద్దులో వ్యూహాత్మక రోడ్లు.. హెలికాప్టర్లతో భారీ యంత్రాల తరలింపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.