యాప్నగరం

భారత్ బంద్.. గృహ నిర్బంధంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

మంగళవారం ఉదయం నుంచి భారత్ బంద్ కొనసాగుతున్నా.. ఉదయం 11 నుంచి రహదార్లను నిర్బంధించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇది కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.

Samayam Telugu 8 Dec 2020, 11:32 am
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు తలపెట్టిన ‘భారత్ బంద్’ కొనసాగుతోంది. మొత్తం 25 రాజకీయ పార్టీలు ఈ బంద్‌కు మద్దతు తెలపగా.. పలు ఉద్యోగ, విద్యార్ధి, కార్మిక సంఘాలు సంపూర్ణంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. ఈ బంద్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ట్విట్టర్‌లో వెల్లడించింది. గత 13 రోజులుగా సింఘు సరిహద్దులో నిరసనలు కొనసాగిస్తున్న రైతులను కేజ్రీవాల్ సోమవారం కలిసి వారికి సంఘీభావం తెలిపారు. అప్పట్నించి సీఎంను పోలీసుల గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఓ ట్వీట్‌లో పేర్కొంది.
Samayam Telugu అరవింద్ కేజ్రీవాల్
Aravind Kejriwal


సీఎం కేజ్రీవాల్ ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, ఆయన బయట నుంచి ఎవరూ లోపలికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆప్ తెలిపింది. సింఘు సరిహద్దుల్లో రైతులను కలవడానికి కేజ్రీవాల్‌ వెంట వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, కనీసం కార్యకర్తలను కూడా కలుసుకునేందుకు అనుమతించలేదని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. బీజేపీ వాళ్లను మాత్రం కేజ్రీవాల్ నివాసం వెలుపల బైఠాయించేందుకు అనుమతించారని ఆయన ఆరోపించారు.

సింఘు సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను కలుసుకుని సంఘీభావం తెలిపిన సీఎం కేజ్రీవాల్.. అక్కడ నుంచి వచ్చేసరికి ఇంటివైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి హౌస్ అరెస్టు చేశారని అన్నారు. హోం మంత్రిత్వ శాఖ తరఫున పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసిందని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కలవడానికి వెళ్తే అడ్డుకున్నారని తెలిపారు. రైతుల ఆందోళన, భారత్ బంద్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపింది. కనీస మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాలని వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌లో పెట్టిన సందర్భంలోనే తాము కేంద్రానికి సూచించామని ఆప్ వివరించింది. రైతులకు బాసటగా ఉంటామని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.