యాప్నగరం

ఎన్నికల ప్రచారంలో నితీశ్‌పై ఉల్లిగడ్డలతో దాడి.. ప్రత్యర్థి తేజస్వీ తీవ్ర ఆగ్రహం

బిహార్ శాసనసభ ఎన్నికల్లో నేతలకు ఊహించని పరాభవం ఎదురువుతోంది. ప్రచార సభల్లో నేతలపై చెప్పులు విసరడం, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 4 Nov 2020, 4:42 pm
బిహార్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరువుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మూడో దశ పోలింగ్ నవంబరు 7న జరగనుండగా ఫలితాలు నవంబరు 10న వెలువడనున్నాయి. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి అధికార, ప్రతిపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇదే సమయంలో నేతలకు ఊహించని పరాభవాలు, చెప్పు దెబ్బలు, ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రతిపక్ష కూటమి నేత తేజస్వీ యాదవ్‌పై చెప్పులు విసిరిన ఘటనలు కలకలం రేపాయి.
Samayam Telugu తేజస్వీ యాదవ్
Tejashwi yadav


ముఖ్యంగా ఎన్నికల ర్యాలీలో తేజశ్వీ కంటే నితీశ్‌నే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా, మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్‌పై దుండగులు ఉల్లిగడ్డలు విసిరారు. దీనిపై నితీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా విసరండి అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై ఉల్లిగడ్డలు విసరడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయనకు వలయంగా ఏర్పడటంతో సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. నిందితులను భద్రతా సిబ్బంది పట్టుకున్నా వారి గురించి పట్టించుకోవద్దని నితీశ్ సూచించారు.

అయితే, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తేజస్వీ యాదవ్.. తీవ్రంగా ఖండించారు. నితీశ్‌పై ఉల్లిగడ్డలను విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని.. మన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తామంతా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తున్నామని... ఇలాంటి దాడులు సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నితీశ్‌పై విమర్శలు గుప్పించిన లాలూ తనయుడు.. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటతప్పారని ఆరోపించారు.

వలస కార్మికుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, వారిని నేరస్థుల మాదిరిగా చూస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, బీహార్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని చెబుతూనే ఉంది కాని ఎవరికీ ఉద్యోగాలు రాలేదు.. వరదలకు నష్టపోయిన ప్రాంతాలను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మూడో విడత పోలింగ్‌లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందని తేజస్వీ ఆశాభావం వ్యక్తం చేశారు. నితీశ్‌కు వీడ్కోలు తప్పదని, ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని పునరుద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.