యాప్నగరం

కర్ణాటకపై బీజేపీకి ఆశలు పోలేదు!

యడ్యూరప్ప బలనిరూపణలో విఫలం అయ్యి రాజీనామా చేసి తప్పుకున్నా, కర్ణాటకపై భారతీయ జనతా పార్టీ ఆశలు అడుగంటలేదు

Samayam Telugu 21 May 2018, 9:59 am
యడ్యూరప్ప బలనిరూపణలో విఫలం అయ్యి రాజీనామా చేసి తప్పుకున్నా, కర్ణాటకపై భారతీయ జనతా పార్టీ ఆశలు అడుగంటలేదు. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఇంకా అవకాశాలు ఉన్నాయనే భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఒకవైపు కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు కాకపోయినా మరి కొన్ని రోజులు, నెలల్లో అయినా అవకాశం తమకే వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కర్ణాటక ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. రెండు మూడు నెలల్లోనే కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu karnataka-assembly


కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్, ముఖ్యమంత్రి పీఠాన్ని జేడీఎస్‌కు ఇస్తోంది. సీఎం సీటు విషయంలో రొటేషన్ పాలసీ ఏమీ లేదని, ఐదేళ్లూ తనే ముఖ్యమంత్రిగా తనే ఉంటానని జేడీఎస్ నేత కుమారస్వామి ప్రకటించుకొంటూ ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడినా.. అన్ని విషయాల్లోనూ రాజీ పడలేదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు. మంత్రి పదవుల విషయంలో, నామినేటెడ్ పదవులు విషయంలో, కాంట్రాక్టుల విషయంలో, క్షేత్రస్థాయిలో జేడీఎస్- కాంగ్రెస్ నేతల మధ్యన సయోధ్య కుదిరే అవకాశాలు తక్కువని... వీరు వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని అంటున్నారు.

అలాంటి పరిస్థితే వస్తే అవకాశం తిరిగి తమనే తలుపుతడుతుందని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస మెజారిటీ కన్నా మూడు సీట్లు మాత్రమే కాంగ్రెస్- జేడీఎస్ వద్ద ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అలకలు వచ్చినా, ఏ పార్టీలో ముసలం పుట్టినా కుమారస్వామి ప్రభుత్వం కూలడం ఖాయమని.. ఆ పరిస్థితులను తాము సద్వినియోగం చేసుకోగలమని విశ్వాసంతో చెబుతున్నారు బీజేపీ నేతలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.