యాప్నగరం

ఏనుగు మృతి: బీజేపీ ఎంపీ మేన‌కా గాంధీపై కేసు

Elephant Death: కేరళలో ఏనుగు మృతి ఘటనకు మతం రంగు పులుముతూ.. సోషల్ మీడియాలో కొంత మంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీతో పాటు పలువురిపై ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 5 Jun 2020, 6:35 pm
కేర‌‌ళ రాష్ట్రం పాల‌క్కడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఏనుగు హ‌త్యోదంతం‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశం బీజేపీ సీనియర్‌ నాయకురాలు మేనకా గాంధీపై కేసు న‌మోదుకు కార‌ణ‌మైంది. మ‌ల‌ప్పురం జిల్లాలోని ఓ పోలీస్ స్టేష‌న్‌లో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. మలప్పురం జిల్లాను, జిల్లా ప్రజలను కించపరిచే విధంగా మేన‌కా గాంధీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆ జిల్లాకు చెందిన సుభాష్‌ చంద్రన్‌ అనే న్యాయ‌వాది‌ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనకా గాంధీతో పాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన పలువురిపై ఫిర్యాదు చేశారు.
Samayam Telugu మేనకా గాంధీ
Maneka Gandhi on Elephant Death


అత్యంత అమానవీయకరంగా పైనాపిల్‌లో బాంబ్ పెట్టి ఏనుగు మరణానికి కారణమైన ఘటనపై యావత్ దేశం అగ్గిగుగ్గిలం అవుతోంది. సోషల్ మీడియాలో ఉద్యమమే నడుస్తోంది. ఈ క్రమంలో మేనకా గాంధీ ట్విటర్‌ వేదికగా ఏనుగు ఘటనపై స్పందించారు. ‘మలప్పురం జిల్లాలో మూగజీవాలపై అమానుషంగా ప్రవర్తించే నేర ప్రవృత్తి ఎక్కువ. ఇప్పటివరకు ఒక్క నేరస్థుడిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా అయితే వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై దుమారం రేగుతోంది.

మే 29న వెలుగులోకి వచ్చిన ఏనుగు ఘటన పాలక్కడ్‌ జిల్లాలో చోటు చేసుకుందని.. మలప్పురం జిల్లాలో కాదని లాయర్ సుభాశ్ చంద్రన్ తెలిపారు. ఈ ఘటనకు కొంతమంది మతం రంగు పులుముతున్నారని ఆయన ఆరోపించారు. ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ మలప్పురం జిల్లాపై, జిల్లా వాసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా వాసుల‌ను హంత‌కులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

మరోవైపు.. ఏనుగు మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం (జూన్ 5) ఒకరిని అరెస్ట్ చేశారు. త్వరలోనే మిగతా నిందితులను అరెస్ట్ చేస్తామని కేరళ అటవీ శాఖ మంత్రి తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తి స్థానికంగా పేలుడు పదార్థాలను అమ్ముతాడని పోలీసులు గుర్తించారు. క్రూర జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాసులు, పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే.. అవే పేలుడు పదార్థాలతో గర్భిణి ఏనుగు మృతికి కారణమైన తీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఏనుగు మృతి ఘ‌ట‌న‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ ఆదేశించారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని.. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను గుర్తించామని ఆయన గురువారం వెల్లడించారు.

Also Read: కేరళలో అదే తీరులో మరో ఏనుగు మృతి

Must Read: డాక్టర్లు, నర్సులకు కొవిడ్.. దేశంలో కలవరపెడుతున్న అంశం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.