యాప్నగరం

సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ.. బెంగాల్ ప్రభుత్వానికి సీజే హెచ్చరిక!

శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ రాత్రికి రాత్రే దీక్షకు దిగారు.

Samayam Telugu 4 Feb 2019, 12:14 pm
శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించగా, పశ్చిమ్ బెంగాల్ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. కోల్‌కతా సీపీని ప్రశ్నించడానికి తమ అధికారులు వెళ్తే వారిని పోలీసులు చుట్టుముట్టారని, ఈ విషయంలో తమకు సహకారం అందజేయాలని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. అనేక సార్లు సీపీ రాజీవ్ కుమార్‌కు సమన్లు జారీచేసినా స్పందించలేదు సరికదా, విచారణకు ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ వివరించింది. కాబట్టి ఈ కేసులో రాజీవ్ కుమార్‌ సహకరించేలా సూచనలు చేయాలని కోరారు. అంతకు ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కోల్‌కతా పోలీస్ కమిషనర్ తక్షణమే లొంగిపోవాలని వ్యాఖ్యానించారు.
Samayam Telugu mamata2


పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ మాట్లాడుతూ.. సీబీఐ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అంతేకాదు ఈ కేసులో కమిషనర్ రాజీవ్ కుమార్ సాక్షి మాత్రమేనని, నిందితుడు కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ధర్మాసనం.. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం హాజరై తమ వాదనాలు వినిపించాలని ఆదేశించింది. ఒకవేళ శారదా కుంభకోణం కేసులో పత్రాలను తారుమారు చేయడానికి ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు ప్రయత్నిస్తోన్నట్టు ఏ చిన్న ఆధారమైనా సీబీఐ సమర్పిస్తే తీవ్రమైన పరిణామాలు ఏదుర్కోక తప్పదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ హెచ్చరించారు. శారదా కుంభకోణానికి సంబంధించిన అన్ని పత్రాలు, ఆధారాలను తమ ముందుంచాలని సీబీఐ ఆదేశించారు.

మరోవైపు, సీబీఐ వ్యవహారంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సీబీఐ అధికార దుర్వినియోగంపై చర్చించాలని కోరుతూ 267 నిబంధన కింద ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. అయితే, దీన్ని తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.