యాప్నగరం

మరో ఘనత సాధించిన కోణార్క్‌.. ఆ తరహా తొలి నగరంగా రికార్డు

దేశంలోనే మొట్టమొదటి శూన్య ఉద్గార నగరంగా రాష్ట్రానికి చెందిన కోణార్క్‌ అవతరించనుంది. 2022 సెప్టెంబర్‌ నాటికి కోణార్క్‌కు ఈ అవకాశం దక్కనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సువర్ణావకాశం కోసం రాష్ట్ర సర్కార్‌ కృషి చేస్తోంది.

Samayam Telugu 3 Aug 2021, 9:33 pm
ప్రాచీన దేవాలయాలతో దేశం మొత్తాన్ని ఆకర్షించే ఒడిశాలోని కోణార్క్ ఇప్పుడు మరో ఘనత దక్కించుకోబోతోంది. దేశంలోనే మొట్టమొదటి శూన్య ఉద్గార నగరంగా కోణార్క్‌ అవతరించనుంది. 2022 సెప్టెంబర్‌ నాటికి కోణార్క్‌కు ఈ అవకాశం దక్కనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సువర్ణావకాశం కోసం ఒడిశా సర్కార్‌ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కోణార్క్‌ నగరంతో పాటు సూర్య దేవాలయ విద్యుత్తు అవసరాల కోసం పునరుత్పాదక వనరులనే పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తికాగా మిగిలినవాటిని యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Image


కోణార్క్‌ శూన్య ఉద్గార నగరంగా అవతరించేందుకు 10 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుండడంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనిపై ఒడిశా పునరుత్పాదక విద్యుత్తు అభివృద్ధి సంస్థ (ఓఆర్‌ఈడీఏ) సంయుక్త సంచాలకుడు అశోక్‌ చౌదురి మాట్లాడుతూ.. కోణార్క్‌లో శిలాజ విద్యుత్తు వినియోగాన్ని తగ్గిస్తూ సౌర విద్యుత్తు వంటి పునరుత్పాదక వనరులను మెరుగుపరిచే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. నేలపైన, పైకప్పులపై సౌర ఫలకల ఏర్పాటు, సౌర తాగునీటి కేంద్రాలు, విద్యుత్తు వాహనాలు, బ్యాటరీ ఛార్జింగ్‌ స్టేషన్లు తదితర వాటిపై పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. కోణార్క్‌ను శూన్య ఉద్గార నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం విద్యుత్తు వినియోగం లెక్కించగా 10 మెగావాట్లు వచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు కోణార్క్ అంత అనువైన ప్రదేశం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బంగాళాఖాతానికి అతి సమీపంలో ఈ ప్రాంతం ఉండటంతో తుపానులు, ఇతర వైపరీత్యాల వల్ల ఈ తరహా ప్లాంటుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చని పేర్కొన్నారు. వేరే ప్రాంతంలో ప్లాంటు ఏర్పాటు చేసి అక్కడి నుంచి నగరానికి అవసరమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోణార్క్, సూర్య దేవాలయాన్ని శూన్య ఉద్గార ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు నూతన పునరుత్పాదక వనరుల విద్యుత్తు మంత్రిత్వశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ఒడిశాకు అందిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.