యాప్నగరం

జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలన.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ అనూహ్యంగా మద్దతు ఉపసంహరించుకోవడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి మొహబూబా ముఫ్తీ తప్పుకున్నారు. దీంతో అక్కడ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది.

Samayam Telugu 21 Jun 2018, 9:08 am
జమ్మూ కశ్మీర్‌లో బుధవారం నుంచి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతూ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నర్ పాలన అమల్లోకి వచ్చిన వెంటనే ఉన్నతాధికారులతో వోహ్రా సమావేశం నిర్వహించి, శాంతిభద్రతలను సమీక్షించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన బీవీఆర్ సుబ్రమణ్యంను జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీబీ వ్యాస్ స్థానంలో నియమించారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి బీబీ వ్యాస్‌, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌తో గుర్తింపు పొందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్‌లను గవర్నర్ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగుకుండా చూడాలని గవర్నర్ ఈ సందర్బంగా ఆదేశించారు.
Samayam Telugu బిపిన్ రావత్


పీడీపీ ప్రభుత్వం అనూహ్యంగా కూలిపోవడంతో ఉగ్రమూకలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని, దీంతో అమర్‌నాథ్ యాత్రకు విఘాతం కలిగించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు హెచ్చరించాయి. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పరిస్థితి సున్నితంగా మారడమే కాదు, పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించే వీలుందని తెలిపింది. దీంతో రాబోయే నెలన్నర రోజుల్లో తీవ్రవాదులు దాడులకు తెగబడే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలనపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల గురించి తాము ఆలోచించిడం లేదని, ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేదని అన్నారు. భద్రతా దళాలు మరింత స్వేచ్ఛ వచ్చిందని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని రావత్ వివరించారు.

పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సైనిక ఆపరేషన్లు నిలిపివేసినా, ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించారని తెలిపారు. ఉగ్రవాదలు చర్యల వల్లే కాల్పులు విరమణకు స్వస్తిచెప్పామని పేర్కొన్నారు. గవర్నర్ పాలన ప్రభావం సైనిక చర్యల్లో ఉంటుందని భావించడంలేదని రావత్ వ్యాఖ్యానించారు. సైన్యం ఎలా పనిచేయాలో చెబుతూ ఎప్పుడూ ఎలాంటి ఒత్తిడి, నియంత్రణ లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.